Volunteers : వాలంటీర్లు దెబ్బేస్తారా? పక్కన పెట్టడం వల్ల నష్టం వారికేనా?

వాలంటీర్లు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడం రాజకీయ రగడగా మారింది

Update: 2024-04-04 05:58 GMT

ఒక వ్యవస్థ హిట్ అయితే.. దానిని ప్రజలు ఆదరిస్తారు. లేకుంటే రాజకీయంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. కానీ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ అయింది. ఎంతగా అంటే.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల వ్యవస్థను జనం స్వాగతించారు. ఇప్పుడు ఎన్నికల నిబంధనలతో పక్కన పెట్టడంతో రాజకీయంగా ఎవరికి నష్టం అనే చర్చ ఏపీ పాలిటిక్స్ లో జోరుగా సాగుతుంది. వాలంటీర్ల వ్యవస్థను తొలి నుంచి తప్పుపడుతున్న విపక్షాలు ఇప్పడు స్వరం మార్చాయి. పింఛను ఇంటి వద్దనే పంపిణీ చేయాలని, అధికార పార్టీ కావాలనే తమను ప్రజల్లో పలచన చేసేందుకు ఇలా వ్యవహరిస్తుందని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ కారణంగానే వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతోనే వారు విధులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వైసీపీ చెబుతోంది. కానీ బాధపడేది జనం. వారిలో ఎక్కువ మంది మాత్రం వాలంటీర్లను పక్కన పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. ఏప్రిల్ నెల సరే.. మే నెలలో పోలింగ్ జరగనున్న నెలలో పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారన్న టెన్షన్ మాత్రం విపక్ష పార్టీల్లో నెలకొంది.

కుటుంబ సభ్యుల్లో ఒకరిగా...
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు ప్రజలకు చేరువయ్యారు. గత నాలుగేళ్ల నుంచి వాలంటీర్లకు, ప్రజలకు మధ్య బంధం మరింత గట్టిపడింది. ఏ పని కావాలననా వాలంటీర్లు చేసి పెడుతుండటం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పి పోవడంతో 90 శాతం మంది ప్రజలు వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకోకుండా ఉండలేరు. లబ్దిదారుల ఎంపిక నుంచి రేషన్ కార్డు మంజూరు, కుల ధృవీకరణ పత్రం వంటివి కూడా ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. అంతేకాదు ఇక పింఛన్లు అయితే ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి మరీ డబ్బులు ఇచ్చి మరీ వెళుతుండటంతో వారు కుటుంబ సభ్యల్లో ఒకటిగా మారిపోయారు. అంతే కాదు ఒకటోతేదీన పింఛను ఇంటివద్దనే తీసుకోవడానికి అలవాటుపడిపోయారు. 66.36 లక్షల మంది ప్రతి నెలా పింఛను అందుకుంటున్నారు.
రెండున్నర లక్షల మందికి పైగా...
జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ వ్యవస్థ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే వృద్ధులు, వికలాంగులు, వివిధ రోగాలతో బాధపడుతున్న వారు కాలు కదపకుండా సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రధానంగా కరోనా సమయంలోనూ వారు అందించిన సేవలను ఎవరూ మరిచిపోరు. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీరు ఉండటంతో తమకు ప్రభుత్వం నుంచి ఏ అవసరమున్నా వారితో చెప్పుకునేందుకు ప్రజలు అలవాటుపడిపోయారు. ఐదువేల రూపాయల జీతంతో వారు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాలంటీర్లలో కొద్ది మంది ఇబ్బందులు పెట్టినా 95 శాతం మంది మాత్రం సేవాభావంతో పనిచేశారనే చెప్పాలి.
ఎన్నాళ్ల నుంచో అభ్యంతరం...
అయితే ఎన్నికలు వచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థపై ఎప్పటి నుంచో విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇది జగన్ ఎత్తుగడ అని, ఎన్నికల్లో గెలిచేందుకు వాలంటీర్లను ఉపయోగించుకునేందుకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆరోపించాయి. సహజంగా విపక్షాలు అనడంలో తప్పులేదు. వాటి భయం అలాంటిది. ప్రజలను ఎన్నికల సమయంలో ప్రభావితం చేసే అవకాశమున్నందున వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా డిమాండ్ చేశాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సచివాలయం సిబ్బంది, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోకూడదని షెడ్యూలు విడుదల చేసే సమయంలోనే స్పష్టమైన ప్రకటన చేసింది. దానికి ఎవరూ పెద్దగా అభ్యంతరం పెట్టలేదు.
పింఛను కోసం...
కానీ పింఛను మొత్తం ఇంటికి వెళ్లి అందించడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పింఛను తీసుకోవడానికి ఇప్పుడు సచివాలయానికి వృద్ధులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎర్రటి ఎండలో వృద్ధులు వెళ్లలేక సొమ్మసిల్లి మృతి చెందిన ఘటనలు కూడా వింటున్నాం. పింఛనును ఇన్నాళ్లూ ఇంటి వద్దనే అందుకున్న వారు ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం చాలా ఇబ్బందిగా మారింది. దీంతో వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. అలాగే కావాలనే ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతూ, ఖజానాలో డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వడంతోనే పింఛను ఇవ్వడంలో ఆలస్యమయిందని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచడం విపక్ష పార్టీలకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందనే చెప్పాలి. అయితే మే నెల పింఛను ఇంటివద్దనే పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రం కొంత విపక్షాలకు అడ్వాంటేజీ అవుతుంది. మరి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది ఎన్నికల ఫలితాల తర్వాతనే తేలనుంది.


Tags:    

Similar News