Ap Elections : మావా... మండేఎండలు దెబ్బేసేటట్లున్నాయిరా.. ఓటింగ్‌కి వస్తారా? ఎవరికి నష్టమంటావ్?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మండుటెండల మధ్య జరగనున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.;
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మండుటెండల మధ్య జరగనున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో ఎండలు మరింత ముదిరిపోతాయి. 45 డిగ్రీల నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఇది వాతావరణ శాఖ ముందు నుంచి చెబుతున్నదే. అయితే ఎన్నికల వేళ ఇంతట ి ఎర్రటి ఎండలో ఓటు వేయడానికి జనం పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కడతారా? అన్న అనుమానం ఇప్పుడు అభ్యర్థులకు పట్టుకుంది. గుండెల్లో దడ మొదలయింది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాలకు వద్దకు వస్తారా? రారా? అన్న అనుమానం అన్ని పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి.
ఎండలు దంచి కొడుతుండటంతో...
మార్చి నెలలోనే ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ మొదటి మాసంలోనే 45 డిగ్రీలకు చేరుకుంది. మే నెలలో ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి. అలాంటిది పోలింగ్ కేంద్రాలకు వచ్చి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటారా? అన్నది పెద్ద డౌట్ గానే ఉంది. ఎంత నీడను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినా ఇంటి నుంచి బయటకు రావాలంటేనే అనేక మంది వెనుకంజ వేస్తారు. ప్రధానంగా ధనిక, ఎగువ మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉండవన్నది అభ్యర్థుల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో కొన్ని పార్టీల్లో ఇప్పటి నుంచే ఎండల భయం పట్టుకుంది.
సెలవు దినమయినా...
పోలింగ్ తేదీ మే 13న సహజంగానే సెలవు దినంగా ప్రకటిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఏడు గంటలకు సెలవురోజు బయటకు వెళ్లడం ఎందుకని ఆలస్యంగా నిద్రలేచే సరికి భానుడి భగభగలు ప్రారంభమవుతాయి. దీంతో ఓటు వేయాలన్న ఉత్సాహం నీరు గారిపోయే ప్రమాదం ఉంది. ఎన్నికల కమిషన్ ఎంతగా పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నాలు చేసినప్పటికీ హైదరాబాద్ లో చలికాలంలోనే 48 శాతం కంటే తక్కువ నమోదయిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. అందుకే అర్బన్ ఏరియాలో ఈసారి ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి.
పోలింగ్ తక్కువయితే....
పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటే అధికార పార్టీకి కొంత వ్యతిరేకత అంటారు. అందులోనూ అర్బన్ లో వైసీపీకి కొంత వ్యతిరేకత బాగానే ఉంది. దీంతో వైసీపీ నేతలు అర్బన్ ఏరియాలో పోలింగ్ శాతం మంచిదేనన్న ధోరణిలో ఉన్నారు. అదే సమయంలో విపక్ష కూటమికి పట్టున్న అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గితే తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయోమోనన్న ఆందోళన టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఉంది. అందుకే ఇప్పటి నుంచే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. కానీ ఎన్ని ఏర్పాట్లు చేసినా మండే ఎండలలో క్యూలో నిలబడి ఓటు వేయడానికి ఏపీలోని ప్రజలు సిద్ధపడతారా? ఎవరికి దెబ్బేస్తారు? అన్న చర్చ అయితే అన్ని రాజకీయ పార్టీల్లో మొదలయింది. మొత్తం మీద సూరీడు మాత్రం ఈ ఎన్నికల్లో ఎవరికి వడదెబ్బ తగిలేలా చేయడం ఖాయమన్న కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి.