Devineni Uma : దేవినేని ఉమకు టిక్కెట్ దక్కనది అందుకేనట..? పక్కన పెట్టింది అందుకేనా?

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు టిక్కెట్ దక్కకపోవడం టీడీపీలోనే కాదు... రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది.

Update: 2024-04-01 06:04 GMT

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు టిక్కెట్ దక్కకపోవడం తెలుగుదేశం పార్టీలోనే కాదు... రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. దేవినేని ఉమ చంద్రబాబుకు నమ్మకస్థుడు. చినబాబు లోకేష్ వద్ద కూడా అణుకువగా ఉంటాడు. అలాగే 2014 నుంచి 2019 వరకూ కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించారు. చంద్రబాబుతో పాటు పార్టీ లోటుపాట్లు అన్నీ ఉమకు తెలుసు. అందులోనూ ఉమ కృష్ణా జిల్లాలో సీనియర్ నేత. ఆయనను కాదంటారని ఎవరూ అనుకోలేదు. అందులోనూ ఆయన స్థానంలో పార్టీ మారి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు టిక్కెట్ ఇస్తారని కూడా ఊహించలేదు.

ఫస్ట్ లిస్ట్ లోనే...
ఎందుకంటే ఉమకు ఫస్ట్ లిస్ట్ లోనే టిక్కెట్ రావాల్సి ఉంటుంది. మైలవరంలో ఉమకు వ్యతిరేకత ఉందన్నది ట్రాష్ అంటున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా ఉత్తుత్తిదేనని చెబుతున్నారు. అలాగే బొమ్మసాని సుబ్బారావు తీవ్రస్థాయిలో ఉమను వ్యతిరేకించడం వల్ల కూడా ఆయనకు టిక్కెట్ రాలేదన్నది కూడా అబద్ధం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ యాక్టివ్ గా ఉన్న నేతలపై వ్యతిరేకత ఉంటుంది. అదే సమయంలో దేవినేని ఉమ నాయకత్వాన్ని కూడా కొందరు నేతలు వ్యతిరేకించ వచ్చు. అంతమాత్రాన ఉమకు టిక్కెట్ ఇవ్వకుండా, వేరే వారికి ఇచ్చేటంత అనుభవం లేని నేత కాదు చంద్రబాబు. అందుకే బొమ్మసాని ఎఫెక్ట్ కూడా ఉత్తుత్తికే నంటున్నారు.
షరతు ఏంటి?
మరి ఏం జరిగింది? దేవినేని ఉమను ఎందుకు పక్కన పెట్టారన్నది ఎవరికీ అర్థం కానీ ప్రశ్న. కానీ బీజేపీలో ఉన్న ఒక మాజీ కేంద్ర మంత్రి ఈ విషయంలో చక్రం తిప్పారంటున్నారు. ఆయన శాసనసభకు పోటీ చేయాలని భావించి దేవినేని ఉమను పక్కన పెట్టాలని చంద్రబాబుపై వత్తిడి తెచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఉండి బీజేపీలో చేరిన ఆ నేత వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలవాలన్నా, ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కొంత సానుకూలత రావాలన్నా తన మాట వినాలని టీడీపీ హైకమాండ్ కు షరతు లాంటిది పెట్టినట్లు పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ తరుపున అసెంబ్లీకి బరిలోకి దిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి తీసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఈ షరతులు పెట్టినట్లు ఉమ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
మంత్రి పదవి కోసం..
ఆయన వల్లనే తమ నేతకు టిక్కెట్ రాలేదంటూ ఇప్పటికే కొందరు సోషల్ మీడియాలో దేవినేని ఉమ వర్గీయులు పోస్టింగ్ లు పెడుతున్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో దానిని సాకుగా చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇవ్వరని ఆయన ముందుగానే దేవినేనికి చెక్ పెట్టినట్లు తెలిసింది. ఉమకు టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి వచ్చే ప్రభుత్వంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తారని అందుకే ముందుగానే ఆయనను పక్కన పెడితే తనకు బుగ్గకారు ఖాయమని నమ్మిన ఆ నేత ఈ తతంగం మొత్తం నడిపినట్లు తెలిసింది. ఆ నేత వసంత కృష్ణ ప్రసాద్ కు సన్నిహితుడని కూడా చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియదు కానీ.. ఉమకు మాత్రం ఆనేత షాక్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటుండటం విశేషం.


Tags:    

Similar News