Ap Elections : తొలి ఫలితం ఇద్దరికీ సగం సగమా? పూర్తి లెక్క తేలేవరకూ సమయం ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలట్లతో కౌంటింగ్ ప్రారంభం కానుంది. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు తొలుత వెలువడనున్నాయి. చివరిగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెలువడనున్నాయని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఈవీఎంలు తక్కువ, ఎక్కువ రౌండ్లు ఉండటం కారణంగా తొలి ఫలితం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వస్తుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
నరసాపురం టీడీపీకి అనుకూలంగా ఫలితం రావచ్చు. కొవ్వూరు మాత్రం వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశముందని తెలిసింది. ఇక పార్లమెంటు స్థానాల్లో తొలుత బీజేపీ అధ్యక్షురాలు పోటీ చేసిన రాజమండ్రి స్థానంతో పాటు నరసాపురం స్థానంలో తొలి ఫలితం వెల్లడవుతుంది. చివరిగా అమలాపురం పార్లమెంట్ ఫలితం వెలువడే అవకాశముంది. ఒక్కొక్కి ఈవీఎంను లెక్కించడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
చివరిగా అమలాపురం...
అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకర్గాలకు కేవలం పదమూడు రౌండ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో లెక్కింపు ప్రారంభమయిన ఐదు గంటల్లోగా తొలి ఫలితం వెలువడనుంది. రెండు పార్టీలకు చెరొక స్థానం వచ్చే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి పార్లమెంట్ స్థానం కూడా పదమూడు రౌండ్లలో పూర్తి కానుంది. అమలాపురం పార్లమెంటు స్థానం మాత్రం 27 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. అమలాపురం పార్లమెంటు పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే సరికి సాయంత్రం ఐదు, ఆరు గంటల సమయం పడుతుందని అంచనా.