TDP : నారాయణ ఈసారి సిలబస్ మార్చాడట.. నెగ్గడం కోసం న్యూ స్కూల్ ఓపెన్ చేశాడంట్రోయ్
నెల్లూరు నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ గెలుపు కోసం శ్రమిస్తున్నారు.;
పొంగూరు నారాయణ... ఆయన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైన నేత. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఆయన అందరికీ తెలిసిన వాడే. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నారాయణ ఈసారి మాత్రం గెలవాలన్న కసితో తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఆయన తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ అయి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఆ ఐదేళ్ల పాటు పనిచేసి ప్రధానంగా నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు పెద్దయెత్తున చేపట్టారు.
గత ఎన్నికల్లో ఓటమితో....
2019 ఎన్నికల్లో నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆయన తన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తో దాదాపు మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో పాటు ఆయన అమరావతి రాజధాని నిర్మాణంలో జరిగిన అక్రమాలకు పాల్పడ్డారన్న దానిపై కేసులు నమోదు కావడంతో దాదాపు నాలుగున్నరేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా తన విద్యాసంస్థలకే సమయాన్ని వెచ్చించారు. ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడిపారు. విజయవాడ వైపు చూడను కూడా లేదు. నెల్లూరు నగరానికి కూడా పెద్దగా వచ్చింది లేదు. అక్రమ కేసులతో ఆయన ఏపీకి రావడమే మానేశారు. అయితే ఈసారి ఆయన ఎలాగైనా నెల్లూరు నగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. అందుకు నగరమంతా చుట్టి వస్తున్నారు.
సొంత పార్టీ నేతలను...
నారాయణతో పాటు ఆయన భార్య కుటుంబ సభ్యులు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే గత ఎన్నికల్లో తాను ఇచ్చిన డబ్బు ఓటర్లకు చేరలేదని, అందుకే తన ఓటమికి కారణమని నారాయణ నమ్ముతున్నారట. సొంత పార్టీ నేతలే డబ్బులు పంచకుండా, సరిగా జనం వద్దకు వెళ్లకపోవడంతోనే తన ఓటమికి ప్రధాన కారణంగా నారాయణ గుర్తించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థికంగా, సామాజికపరంగా బలవంతుడైన నారాయణ గత ఎన్నికల్లో డబ్బులు ఖర్చు బాగా ఖర్చు పెట్టినా గెలవలేకపోయారంటే.. అది సొంత పార్టీ నేతలే తనను మోసం చేశారన్న భావనలో ఆయన బలంగా ఉన్నారు. అందుకే ఈసారి ఆయన తప్పిదం చేయడం లేదని తెలిసింది. ప్రచారం నుంచి అంతటా ఆయన తన సిలబస్ ను మార్చేశాడంటున్నారు. స్టడీ మెటీరియల్ ను అదనంగా సిలబస్ లో చేర్చాడన్న సెటైర్లు వినపడుతున్నాయి.
విద్యాసంస్థల సిబ్బందితో...
స్థానిక టీడీపీ నేతలను తనతో పాటు ప్రచారంలో తిప్పుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయి బాధ్యతలను వారికి ఈసారి ఇవ్వడం లేదని తెలిసింది. ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ హామీలను వివరించే బాధ్యతను కూడా నారాయణ తన సొంత సైన్యాన్ని వినియోగిస్తున్నారట. నారాయణ స్కూళ్లు, కళాశాలల సిబ్బందిని నేరుగా రంగంలోకి దించి ఆయన తన పని కానిచ్చేస్తున్నారట. తన సొంత మనుషులుగా భావించే నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. ఈ విషయంలో కొందరు స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నప్పటికీ వారికి అవసరమైన సాయంచేస్తూ వారిని చల్లబరుస్తూ అసంతృప్తులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొత్తం మీద నారాయణ తన పొలిటికల్ స్కూల్ లో సిలబస్ మార్చి తన స్కూలు ఇదీ అంటూ కొత్త తరహాలో వెళుతున్నాడని పార్టీలో వినిపిస్తున్నట టాక్. ఈదఫా నారాయణ వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్ అహ్మద్ తో పోటీ పడుతున్నారు.