Gummanuri : గుమ్మనూరుకు టిక్కెట్ అయితే వచ్చింది కానీ.. సంతోషం మాత్రం లేదా.. అందుకు రీజన్ ఇదేనా?
ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గుమ్మనూరి జయరాంకు ఈసారి మాత్రం గుంతకల్లులో గెలుపు అంత సులువుగా మాత్రం లేదు
ఆలూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గుమ్మనూరి జయరాంకు ఈసారి మాత్రం గెలుపు అంత సులువుగా మాత్రం లేదు. బోయ సామాజికవర్గానికి చెందిన గుమ్మనూరి జయరాం పై ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే.. జగన్ తన కేబినెట్ లో కొనసాగించారు. ఆయన కుటుంబ సభ్యులపైన కూడా ఆరోపణలు అనేకం వినిపించాయి. అంతేకాదు పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారని స్వయంగా టీడీపీ నేతలే విమర్శించారు. అయితే గుమ్మనూరిని ఈ ఎన్నికల్లో వైసీపీ ఆలూరు నుంచి తప్పించి ఆయనకు కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పడంతో ఆయన మనస్తాపానికి గురై టీడీపీలో చేరిపోయారు.
బలమైన నేత కావడంతో...
ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో గుమ్మనూరి జయరాంను టీడీపీ సాదరంగా ఆహ్వానించింది. అయితే ఆయన కోరుకున్నట్లు ఆలూరు టిక్కెట్ మాత్రం టీడీపీ నాయకత్వం ఇవ్వలేదు. గుంతకల్లులో పోటీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ ఎన్నికల్లో గుమ్మనూరి జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేయడం ఇష్టం లేకపోయినా శాసనసభలో కాలుమోపాలన్న పట్టుదలతో ఆయన అక్కడినుంచి బరిలోకి దిగారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ నేతలు గుమ్మనూరి జయరాం టీడీపీలో రాకను వ్యతిరేకించారు. తాము గుమ్మనూరికి మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా చెప్పారు. అయితే అధినాయకత్వం కొంత సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు కలసి పనిచేస్తారని చెప్పలేని పరిస్థితి.
మూడు సార్లు...
గుంతకల్లు నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. 2009లో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నాటి ఎన్నికల్లో మధుసూదన్ గుప్తా విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. నాటి ఎన్నికల్లో జితేందర్ గౌడ్ గెలిచారు. 2019 ఎన్నికల్లో జితేందర్ గౌడ్ వైసీపీ నుంచి పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తనకు టిక్కెట్ రాకపోవడంతో జితేందర్ గౌడ్ వర్గం గుమ్మనూరికి మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అంటుంది. అధినాయకత్వం చెప్పినా నై..నై అంటూ తెగేసి చెబుతుంది. ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ డంప్ చేయడమేంటని ప్రశ్నిస్తుంది.
ఒకసారి గెలిస్తే....
అయితే గుంతకల్లు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి గెలిచిన వారు మరొకసారి గెలవలేదు. మూడు సార్లు మూడు పార్టీలు గెలిచాయి. అందుకే తాను కొత్త వ్యక్తి అయినా ఇక్కడి ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకంతో గుమ్మనూరి జయరాం ఉన్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికే టిక్కెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా కావలి ప్రభాకర్ బరిలో ఉండనున్నారు. ఇక్కడ కొత్త వారికి అవకాశమివ్వదలచుకుంటే గుమ్మనూరి గెలిచినట్లేనని అంచనాలు వినపడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ క్యాడర్ ఎంత మేరకు ఆయనకు సహకరిస్తుందన్నది కూడా అనుమానుమే. అందుకే గుంతకల్లులో విజయం మాత్రం టీడీపీ, వైసీపీల మధ్య దోబూచులాడుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.