Ys Sharmila : అన్నపై నేరుగా యుద్ధం... ఓడించాలంటూ జనంలోకి అక్కా చెల్లెళ్లు
కడప జిల్లాలో అక్కా చెల్లెళ్లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇద్దరూ కలసి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు
కడప జిల్లాలో వైఎస్ కుటుంబంలో అక్కా చెల్లెళ్లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇద్దరూ కలసి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి కడప జిల్లాలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోడ్ షోలు, బహిరంగ సభల్లో వైఎస్ షర్మిలతో పాటు.. వైఎస్ సునీత కూడా పాల్గొంటున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్ వివేకాను హత్య చేసిన వాళ్లు బయట తిరుగుతున్నారంటూ వాళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విరుచుకుపడుతున్నారు. వైఎస్ సిస్టర్స్ ప్రచారంతో వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నప్పటికీ వారు మాత్రం తాము ఆరోపణలు చేస్తూనే ముందుకు సాగుతున్నారు.
నిందితులకు అండగా...
2019లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే ఐదేళ్ల పాటు నిందితులెవరో తేల్చలేకపోయారంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిందితులు ఎవరో తెలిసినా వారికి అండగా నిలబడుతూ న్యాయాన్ని అందకుండా చేస్తున్నారని ఇద్దరూ చెబుతూ వస్తున్నారు. తమ అన్న అధికారంలో ఉన్నప్పటికీ న్యాయం చేయలేకపోతున్నారని, నిందితుల పక్షాన నిలబడి తమకు అన్యాయం చేస్తున్నారని వారు ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వారు అభ్యర్థిస్తున్నారు. అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ఓడించి వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ వారు ప్రజలను కోరుతూ వెళుతున్నారు.
న్యాయయాత్ర...
న్యాయయాత్ర పేరిట వీరు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లాలో ఈ ఇద్దరి అక్కా చెల్లెళ్ల పర్యటన.. అదీ జగన్ కు వ్యతిరేకంగా సాగుతున్న యాత్రకు ప్రజలు బాగానే వస్తున్నారు.కానీ అక్కడ కాంగ్రెస్ కు సరైన కార్యకర్తలు లేరు. పోలింగ్ బూత్ ల వారీగా ఏజెంట్లు కూడా దొరకని పరిస్థిితి ఉండే అవకాశముందన్న నేపథ్యంలో విపక్షాల సహకారం వీరికి ఉందన్నది అధికార వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లే షర్మిల నడుచుకుంటున్నారని, సునీత కూడా చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారంటూ వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయినా ఈ అక్కా చెల్లెళ్లను చూడటం కోసం జనం మాత్రం బాగానే వస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.