Jc Divakar Reddy : దివాకరం.. ఏం మాట్లాడకపోతే ఎలా... ఎవరు గెలుస్తారో చెప్పయ్యా సామీ?

జేసీ దివాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. ఎన్నికల సమయంలో కూడా ఆయన వాయిస్ ఎక్కడా వినిపించలేదు.

Update: 2024-05-27 07:44 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జేసి దివాకర్ రెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయన నోటికి అంత పవర్ ఉంది. ఆయన ఏదైనా మాట్లాడితే నిర్మొహమాటంగా మాట్లాడతారని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎందుకంటే సీనియర్ నేతగా ఆయనకున్న అనుభవంతో పాటు ఎన్నికలను చూసిన ఆయన మాటలకు విలువ ఉంటుంది. అలాగే ఆయన పోలింగ్ తర్వాత కూడా అనేక సార్లు చెప్పింది నిజమయిందంటారు. తన, మన అని లేకుండా ఆయన చేసే కామెంట్స్ ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. సొంత పార్టీ నేతలపైన కూడా ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కొన్ని సార్లు లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. ఎన్నికల సమయంలో కూడా ఆయన వాయిస్ ఎక్కడా వినిపించలేదు.

కొద్ది రోజులుగా మౌనంగానే...
ఆయన గత కొద్ది రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకూ జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఓటమి అనేది తెలియదు. తర్వాత అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయ జీవితం అంతా దాదాపు కాంగ్రెస్ లోనే గడిపారు. సొంత పార్టీలో నేతలతో కయ్యానికి కూడా ఆయన ఏమాత్రం సంకోచించరు. ఆయన నోట్లో ఎందుకు నానడం అని అందరూ ఆయనకు దూరంగా వెళ్లిపోతారు. అటువంటి జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా ఆయన పార్టీ అధినేతపై విమర్శలు చేసి అందరి నోళ్లలో నానారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ లు అంటూ కూర్చుంటే ఎలా అని బహిరంగ సభలో ప్రసంగించి తన ప్రత్యేకతను చాటు కున్నారు.
ప్రత్యక్ష రాజకీయలకు...
తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చి కేసీఆర్ ను ఓడించడం అంత ఈజీ కాదని కూడా ఆయన 2018 ఎన్నికలకు ముందు జోస్యం చెప్పారు. అయితే తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయినట్లే కనిపిస్తుంది. వారసులు రాజకీయాల్లోకి రావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారంటారు. అయితే జనం నాడి తెలిసిన నేతగా ఆయన మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన కామెంట్స్ సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు, పింఛన్లు నేరుగా ఇంటికి పంపిణీ చేయడం వంటి వాటిపై ఆయన స్పందిస్తూ జగన్ ను తన ఓటు బ్యాంకును పటిష్టంగా చేసుకునే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణలపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పోలింగ్ పూర్తయిన తర్వాత...
అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత పెదవి విప్పలేదు. తాడిపత్రిలో సోదరుడు కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. తమ కుటుంబానికి అడ్డాగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని కూడా పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఆయన మాట్లాడకపోవడం టీడీపీలోనే చర్చనీయాంశమైంది. తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరుకోదన్న సామెతగా ఈయన తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారా? లేక కావాలనే ఏపీ రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారా? అన్నది ఇప్పుడు అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద జేసీ దివాకర్ రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలపై పెదవి విప్పక పోవడం పైన కూడా అనేక అనుమానాలు సైకిల్ పార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి. అందుకే నోరు విప్పు రెడ్డీ అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా జేసీ దివాకర్ రెడ్డిని కోరుతున్నారు.


Tags:    

Similar News