Ap Elections : కాటసాని ఏడోసారి గట్టెక్కుతారా? తనకు తిరుగులేదు అని నిరూపించుకుంటారా?

కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఆరుసార్లు పాణ్యం నుంచి గెలిచి తన అడ్డాగా మలచుకున్నారు

Update: 2024-06-03 12:32 GMT

పాణ్యం నియోజకవర్గం అంటే ముందుగా గుర్తుకొచ్చేది కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఆయన ఆరుసార్లు పాణ్యం నుంచి గెలిచి తన అడ్డాగా మలచుకున్నారు. తన అడ్రస్ అదేనని ఆయన అనేక ఎన్నికల్లో ఢంకా భజాయించి చెప్పారు. ప్రజలతో మమేకం అవ్వడం కావచ్చు. ఆయన వ్యవహార శైలి ప్రజలకు దగ్గరగా చేర్చిందంటారు. కేవలం ఫ్యాక్షన్ మాత్రమే కాదు.. ప్రజల మనసులను గెలుచుకున్న నేతగా కాటసాని రాంభూపాల్ రెడ్డి నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచారంటే ఆయన సత్తా గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఏడోసారి తన అదృష్టాన్ని ఆయన పరీక్షించుకుంటున్నారు.

వ్యక్తిగత ఇమేజ్ తో...
కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ ఉన్న వ్యక్తి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అరవై వేల ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. నాడు అక్కడ వైసీపీ గెలిచింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటి వరకూ 1985, 1989, 1994లో వరసగా మూడు సార్లు పాణ్యం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1985, 1999లో టీడీపీ గాలి బలంగా వీచినా ఆయన ఓటమి చవిచూడలేదు. అలాగే 2004, 2009 లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా ద్వితీయ స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకుని గెలిచారు. ఆయన ట్రాక్ రికార్డు చూసిన వారికి ఎవరికైనా సొంత బలం ఎంత ఉందో ఇట్టే చెప్పకతప్పదు.
అసంతృప్తి ఉన్నప్పటికీ...
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కాటసాని రాంభూపాల్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన అనుచరుల్లో అసంతృప్తి ఉంది. తనకు మంత్రి పదవి దక్కకపోయినా జగన్ ప్రభుత్వంలో తనకు ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన గుర్తు చేసి తన అనుచరులను కొంత శాంతపరిచి తనకు అనుకూలంగా మలచుకున్నారని చెబుతారు. అయితే ఇప్పుడు సొంత బలగంతో పాటు, పార్టీ బలం కూడా తోడయింది. దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా బాగా పనిచేయడంతో ఈసారి కూడా గెలుపు తనదేనన్న ధీమాలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఏడో సారి అసెంబ్లీ లోకి అడుగుపెడతామని ధీమాగా కనిపిస్తున్నారు. పోలింగ్ తర్వాత కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫుల్లు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఏడో సారి గెలిస్తే తనను జగన్ కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా జనంలోకి ఆయన బాగా సంకేతాలను పంపగలిగారు.
గౌరు కుటుంబంపై...
మరోవైపు ప్రత్యర్థి గౌరు చరితారెడ్డికి కూడా మంచి పేరుంది. ఆమె 2014లో వైసీపీ నుంచి పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ కుటుంబంపై చాలా వరకూ సానుభూతి కూడా ఉంది. 2019 ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదని తెలిసి టీడీపీలోకి గౌరు చరిత దంపతులు వెళ్లారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో గౌరు చరితా రెడ్డి కాటసాని పై దాదాపు నలభై వేల ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు నలభై ఓట్ల మెజారిటీని అధిగమించాలంటే మిరాకిల్ జరగాల్సిందేనన్నది విశ్లేషకుల అంచనా. మరోవైపు కర్నూలు జిల్లాలో వైసీపీ బలంగా ఉండటంతో కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఈసారి తనకు కలసి వస్తుందని గౌరు చరితా రెడ్డి అంచనా వేసుకుంటున్నారు. మొత్తం మీద పాణ్యం నియోజకవర్గంలో ఈసారి గెలుపోటములపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అయితే అక్కడ పోలింగ్ ప్రశాంతంగా ముగియడం, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకోవడంతో గెలుపోటములపై ఎవరి ధీమాలో వాళ్లున్నారు.


Tags:    

Similar News