Janasena : ఇంతకీ ఏం జరుగుతుంది భయ్యా.. అంతా అయోమయంగా ఉందే.. జనసైనికులూ జర భదం బ్రదరూ
మహాసేన రాజేష్ నేరుగా జనసేన పార్టీపైన, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా కూటమిలో ఉన్న నేతలు మిత్రపక్షాలను విమర్శించరు. ఏదైనా లోపాయికారీగా ఇబ్బంది పెడతారేమో కానీ బహిరంగంగా మాత్రం ఎవరూ విమర్శించరు. అదిపార్టీ థిక్కారం కింద వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు కూటమిలో ఏం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిని వెంటాడుతున్నాయి. మహాసేన రాజేష్ నేరుగా జనసేన పార్టీపైన, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ ఎన్నికలకు ముందే జాగ్రత్త అంటూ ఒక వార్నింగ్ బెల్ మోగినట్లయింది. అసలు అంతగా విమర్శలు చేస్తున్న మహాసేన రాజేష్ కు తమకు ఏమాత్రం సంబంధం లేదని ఇటు టీడీపీ చెప్పలేకపోతుంది. చర్యలు కూడా తీసుకోలేకపోతుంది.
టీడీపీలో చేరి...
మహాసేన రాజేష్ తూర్పు గోదావరి జిల్లాలో ఒక సామాజికవర్గం నేతగా గుర్తింపుపొందారు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ గా మారడంతో ఒకింత పేరు సంపాదించుకున్నారు. తొలుత మహాసేన రాజేష్ వైసీపీలో చేరారు. తర్వాత ఆయన ఆ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చారు. జనసేనలో చేరాలని భావించినా కుదరలేదు. చివరకు ఆయన తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరారు. రాజమండ్రిలో ఆయన చంద్రబాబు సమక్షంలో ఆర్భాటంగా టీడీపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు పి.గన్నవరం స్థానాన్ని తొలుత తెలుగుదేశం పార్టీ కేటాయించింది. తర్వాత ఆయన వీడియోలు వైరల్ కావడంతో ఆయనకు ఇస్తే ఒకవర్గం ఓటర్లు తమకు ఓట్లు వేయరని భావించి చివరి నిమిషంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది.
పవన్ కు ఓటు వేయవద్దంటూ...
టీడీపీ అధినేత చంద్రబాబు మహాసేన రాజేష్ ను పిలిపించి నచ్చ చెప్పారు. ఆయనకు ప్రత్యేకవాహనం కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయమని చెప్పారు. పి. గన్నవరం సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. తనకు సీటు దక్కి చివరి నిమిషంలో మిస్ కావడానికి వైసీపీ ప్రత్యక్ష కారణమయితే పరోక్షంగా జనసేన నేతలు అని మహాసేన రాజేష్ అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి మహాసేన రాజేష్ పవన్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నట్లే కనపడుతుంది. తమ సామాజికవర్గం ఓటర్లు ఎవరూ పవన్ కల్యాణ్ కు ఓటు వేయవద్దని మహాసేన రాజేష్ బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ కంటే జగన్ బెటర్ అంటూ ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో జనసైనికుల్లో అనుమానం కలుగుతుంది.
అనుమానాలు మరింతగా...
తమ అధినేతను ఓడించాలంటూ మహాసేన రాజేష్ బహిరంగంగా పిలుపునిచ్చినా చంద్రబాబు ఎందుకు ఇంతవరకూ చర్య తీసుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తింది. పార్టీ పరంగా పక్కన పెడుతున్నామంటూ ప్రకటన చేయకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. పవన్ కల్యాణ్ ఓడించాలని చంద్రబాబు ఈరకమైన ప్రచారాన్ని మహాసేన రాజేష్ చేత చేయిస్తున్నారా? అన్న అనుమానం కూడా జనసైనికుల్లో కలుగుతుంది. ఒకవైపు జగన్ ను, లోకేష్ ను పొగుడుతూ మరొక వైపు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తుండటాన్ని చూసిన ఎవరికైనా అనుమానం కలగక మానదు. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మహాసేన రాజేష్ దళిత, ముస్లీం, క్రిస్టియన్స్ ని పవన్ కళ్యాణ్ కి దూరం చేస్తూ వ్యతిరేకంగా ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇంతకూ పిఠాపురంలో ఏం జరుగుతుంది?