Chandrababu : చెప్పేది నమ్మేలా ఉండాలి బాబూ... అంత చెబితే వాళ్లు నమ్ముతారా?

వాలంటీర్ల వ్యవస్థను చూసి విపక్షాలు బెదిరిపోతున్నాయనే చెప్పాలి. వారిని మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Update: 2024-03-31 05:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థను చూసి విపక్షాలు ఒకరకంగా బెదిరిపోతున్నాయనే చెప్పాలి. వారిని మంచి చేసుకునేందుకు అనేకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి వాలంటీర్ వ్యవస్థ బలంగా క్షేత్రస్థాయిలో పాతుకుపోయింది. దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను అందచేయడమే కాకుండా వారికి దక్కాల్సిన పథకాలతో పాటు, లబ్దిదారుల ఎంపిక, వివిధ రకాలైన సర్టిఫికెట్లను ఇంటికి తెచ్చి మరీ ఇస్తుండటంతో జనం వారితో బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే తమ పనులు వదులుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిపోయిందన్న భావన పల్లెల్లో ముఖ్యంగా పేదల్లో ఎక్కువగా కనపడుతుంది. వినపడుతుంది.

బంధం అలాంటిది మరి...
అయితే ఈ వ్యవస్థను వైసీపీ అధినేత జగన్ తీసుకురావడంతో ఎన్నికల వేళ ఆపార్టీకి వాలంటీర్లు ఉపయోగపడతారని విపక్షాలు అనుమానించడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక వాలంటీరు కరోనా సమయంలోనూ సేవలందించడమే కాకుండా ప్రతి నెల ఇంటికి వెళుతుండటంతో వారితో ఒకరకమైన బంధం ఏర్పడింది. అదే విపక్షాల భయం. వారు ఓటర్లను ఎన్నికల్ల ప్రభావితం చేస్తారని విపక్షాలు భయపడటమూ సహజమే. జగన్ ఆ వ్యవస్థను కూడా పెట్టింది అందుకే. కేవలం సామాజిక సేవ మాత్రమే కాకుండా తన ప్రభుత్వ పథకాలు నేరుగా చేరడానికి, తనకు, ప్రజలకు మధ్య వాళ్లను వారధిగా ఉంచే ప్రయత్నం జగన్ చేశారనే చెప్పాలి.
యాభై వేల రూపాయలా?
ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ వ్యవస్థను అధ్యయనం చేసి వెళ్లాయి. అంతెందుకు తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ తెస్తామని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఇంకేముంటుంది? అందుకే వాలంటీర్ వ్యవస్థపై తొలి నుంచి టీడీపీ, జనసేనలు మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను తొలగించమని పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ప్రతి వాలంటీర్ కు నెలకు యాభై వేలు సంపాదించుకునేలా తాను అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? రెండు లక్షల మంది వాలంటీర్లు నెలకు యాభై వేలు సంపాదించుకునేలా చేస్తామనడం నవ్వుకోవడానికే తప్ప నమ్మడానికి అస్సలు పనికి రాని వాగ్దానంగానే వాలంటీర్లు చూస్తున్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో...
తాజాగా సంక్షేమ పథకాలను వాలంటీర్ల వ్యవస్థ చేత పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం కూడా కొంత విపక్షాలకు అననుకూలతే. అసలే ఎండాకాలం. రేపు ఏప్రిల్ ఒకటోతేదీన పింఛను కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడతారు. తమకు వాలంటీర్ల వ్యవస్థే కావాలని కోరుకునే అవకాశముందన్నది కూడా వైసీపీ అంచనాగా ఉంది. వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తమకు అనుకూలంగా మారనున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థపై వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని కూడా ప్రచారానికి వైసీపీ దిగడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News