Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ కు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఉప్పందిందా? లేక జోస్యమా?

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరుంది. అనేక రాష్ట్రాల్లో ఆయన అందించిన వ్యూహాలతోనే అధికారంలోకి వచ్చారు

Update: 2024-05-20 03:33 GMT

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరుంది. అనేక రాష్ట్రాల్లో ఆయన అందించిన వ్యూహాలతోనే అధికారంలోకి వచ్చారు. దానిని ఎవరూ కాదనలేరు. 2019 ఎన్నికల్లో వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగానే వ్యవహరించారు. అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్రను తోసిపుచ్చలేం. అలాగే పొరుగున ఉన్న తమిళనాడు తో పాటు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేశాయి. అందుకు ఆయన అనుసరించే వ్యూహాలు వర్క్ అవుట్ అయ్యాయి. అందుకే దేశ వ్యాప్తంగా రాజకీయ సర్కిళ్లలో ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోయింది. ఆయనకు డిమాండ్ కూడా పెరిగింది.

అన్నీ మానేసి...
కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా మానుకున్నారు. ఆయన బీహార్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. పాదయాత్ర చేశారు. మళ్లీ ఏమయిందో కానీ బీహార్ రాజకీయాల నుంచి వెనక్కు వచ్చినట్లే కనపడుతుంది. అక్కడ తన స్ట్రాటజీ వర్క్ అవుట్ కాదని భావించినట్లుంది. అందుకే ఆయన ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయకపోయినా ఆయన వ్యాఖ్యలు మాత్రం విశ్వసించే ప్రజలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అంచనాలు ఎప్పుడూ తప్పవని చెబుతుంటారు. అందుకే ఆయన చెబితే ఖచ్చితంగా జరిగి తీరుతుందనే వారు అధికంగా ఉన్నారు. అలాగని పీకే జోస్యాలను నమ్మలేమని అనేవాళ్లు కూడా లేకపోలేదు. వారి శాతం తక్కువగానే కనపడుతుంది.
కొద్ది రోజుల నుంచి...
గత కొద్ది రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏదో ఒక సందర్బంలో ఆయన చేసే వ్యాఖ్యలు సంచలనంగానే మారుతున్నాయి. ఈసారి జగన్ అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నారు. ఇప్పటి నుంచి కాదు ఆయన ఎన్నికలకు ముందు నుంచే ఈ మాట చెబుతున్నారు. ఎన్నికల తర్వాత కూడా ఇదే మాటకు కట్టుబడి ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ బర్కాదత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ అధికారంలోకి రావడం జరగదని చెబుతున్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు వైసీపీ వర్గాలు ఆ కామెంట్స్ ను నమ్మకపోయినా కొంత బెంగ మాత్రం బయలుదేరింది. అదే సమయంలో కూటమి పార్టీ నేతల్లో ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ తెలియన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
అంత కాన్ఫిడెన్స్ తో...
కానీ ప్రశాంత్ కిషోర్ ఎక్కడో కూర్చుని ఏపీ రాజకీయ ఫలితాలపై ఎలా అంచనా వేస్తారన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరకదు. అయితే ఇప్పటికీ ఏపీలో ఆయన గతలో ప్రాతినిధ్యం వహించిన ఐప్యాక్ టీం వైసీపీకి ఎన్నికల వేళ సేవలందించింది. ఒకవేళ ఐప్యాక్ టీం నుంచి ఆయనకు ఏదైనా సమాచారం అందిందా? అన్న అనుమానం కూడా ఉంది. అందుకే ప్రశాంత్ కిషోర్ అంత గట్టిగా, కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారా? అన్న వాదన కూడా లేకపోలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఐప్యాక్ టీంతో ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదని, ఆయన కేవలం జగన్ పై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతతోనే పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. దేశంలో మోదీ పాలనపై అసంతృప్తి ఉందని, ఆగ్రహం లేదని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఏపీలో మాత్రం జగన్ పాలనపై ఆగ్రహం ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ మాత్రం ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.


Tags:    

Similar News