.Chandrababu : చంద్రబాబు అన్ హ్యాపీ... కూటమిని అయితే కదుర్చుకున్నారు కానీ డీల్ చేయడంలోనే?
టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి ఏర్పడాలని ఎంతగానో అభిలషించారు. బీజేపీ వ్యవహార శైలిపై అసహనంగా ఉన్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూటమి ఏర్పడాలని ఎంతగానో అభిలషించారు. ఆయన ఎన్నికలకు ముందు నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒకరకంగా పెద్ద యుద్ధమే చేశారనుకోవాలి. నిజంగా చెప్పాలంటే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మోదీ సర్కార్ కు మద్దతు ప్రకటించారు. తనకు, మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం రాష్ఠ్ర ప్రయోజనాల కోసమే తాను బీజేపీని నాడు విభేదించానని చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేనతో సయోధ్యతో వెళుతూనే మూడు పార్టీలూ కలిస్తే తమకు ఎదురు ఉండదని భావించారు. అందుకు ఆయన వేసుకున్న ప్లాన్ ఫలించింది. జనసేనాని సహకారంతో కావచ్చు.. బీజేపీ సొంత అవసరాల కోసం చంద్రబాబు తో జత కట్టి ఉండవచ్చుక. కానీ చంద్రబాబు ఆశించిన స్థాయిలో మిత్రపక్షమైన బీజేపీ ఎన్నికలలో సహకరించడం లేదని ఆయన కొంత అసహనంగా ఉన్నారని చెబుతున్నారు.
ఆ కాంబినేషన్ కోసం కాదు...
బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించారంటే 2014 కాంబినేషన్ కోసం కానే కాదు. అప్పటి మోదీ చరిష్మాకు, నేడు బీజేపీ పట్ల ఏపీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం చూస్తే ఆ పార్టీతో పొత్తుతో కొన్ని ఓట్లను కోల్పోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ముస్లిం మైనారిటీ ఓట్లు మాత్రమే కాకుండా ఎస్‌సీ ఓటర్ల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందని ఆయనకు తెలియనిది కాదు. బీజేపీకి ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్ల శాతం కూడా ఉందని తెలుసు. కానీ కమలం పార్టీతో కాలు దువ్వడం కంటే స్నేహంగా ఉండటానికి ప్రధాన కారణం ఎలక్షనీరంగ్ కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో కనీసం పార్టీకి విరాళం ఇచ్చేందుకు కూడా పారిశ్రామికవేత్తలు భయపడ్డారంటే దానికి కేంద్రంలో ఉన్న బీజేపీని చూసేనని అందరికీ తెలిసిందే. అప్పటికీ కొందరు గుప్తంగా విరాళాలిచ్చినా డబ్బులు ఖర్చు చేయడానికి కూడా టీడీపీ నాటి ఎన్నికలలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.
కష్టపడి దోస్తీ కట్టినా...
ఈసారి అలాంటి పరిస్థితి తమకు ఉండకూడదన్నది ఒకటి కాగా, రెండోది ఆర్థికంగా బలవంతుడైన జగన్ ను నిలువరించడానికి కేంద్ర సాయం అవసరమని అభిప్రాయపడటమే. జగన్ పార్టీని డబ్బులు పంచకుండా చేయగలిగితే ఈ ఎన్నికల్లో యాభై శాతం తాము గెలిచినట్లేనని భావించి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆపార్టీ నేతలు కూడా ఆఫ్ ది రికార్డుగా దానికి అంగీకరిస్తారు. అటు జగన్ ను నిలువరించడంతో పాటు తమకు ఎలక్షనీరింగ్ లో సాయంగా ఉంటారనే కష్టపడి కమలంతో దోస్తీ కట్టారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ పొత్తులో పది అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాలను తీసుకున్న బీజేపీ ఎలక్షనీరింగ్ విషయంలో మాత్రం కూటమికి ఉపయోగపడేలా చర్యలు తీీతీసుకోకపోవడంపై కొంత అసంతృప్తి నెలకొంది.
అధికారుల బదిలీల...
కేంద్ర ఎన్నికల కమిషన్ కు తాము ఫిర్యాదు చేసినా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కానీ, డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డిని పక్కనపెట్టకపోవడాన్ని చంద్రబాబు ఒకింత అసహనంతో ఉన్నారట. తాము ఫిర్యాదుచేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో బీజేపీ నుంచి సహకారం కూడా తమకు అందడం లేదని ఆయన ముఖ్యనేతల వద్ద వ్యాఖ్యానించారట. దీంతో పాటు మోదీ మొదటి సభలో జగన్ ను నేరుగా విమర్శించకపోవడం, ఎన్నికలకు ఇంకా కేవలం ఇరవై రోజులే ఉన్నా మోదీ, అమిత్ షా వంటి నేతలు రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేయకపోవడంపై కూడా ఒకింత అసహానికి చంద్రబాబు గురవుతున్నారని చెబుతున్నారు. తాము ఎన్ని సార్లు రాష్ట్రానికి రావాలని మోదీకి, అమిత్ షాకు ఆహ్వానం పంపినా ఇంతవరకూ డేట్స్ ఖరారు చేయకపోవడాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నారట. కానీ పొత్తు కుదిరింది. ఇక ముందుకు వెళ్లాల్సిందే. కమలంతో పొత్తుతో ఏదో ఊహించుకుంటే..జరుగుతున్నది మాత్రం? జగన్ పార్టీకి లోపాయికారీగా సహకరిస్తుందన్న అనుమానాలు మాత్రం టీడీపీ నేతల్లో ఉన్నాయి.