TDP : తంబ‌ళ్ల ప‌ల్లె లెక్క త‌ప్పిందా..? త‌మ్ముళ్ల ఆవేద‌న మామూలుగా లేదుగా

తంబ‌ళ్లప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ శంక‌ర్ యాద‌వ్ కు టిక్కెట్ ఇవ్వకపోవడంతో పార్టీలో అసంతృప్తి ఉంది.

Update: 2024-04-08 05:14 GMT

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తంబ‌ళ్లప‌ల్లె. ప్రస్తుతం ఇది వైసీపీ కీల‌క నాయ‌కు డు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సోద‌రుడు ద్వారకానాథ్‌రెడ్డి చేతుల్లో ఉంది. అయితే. ఈ జిల్లాపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిప‌త్యాన్ని త‌గ్గించాల‌న్న ల‌క్ష్యంతో ఉన్న చంద్రబాబు.. ప్రతి సీటు విష‌యంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తంబ‌ళ్లపల్లి నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రింత‌ ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. బ‌ల‌మైన నాయ‌కుడిగా క‌నిపించిన‌.. ప్రముఖ కాంట్రాక్టర్‌ దాస‌రిప‌ల్లె జ‌యచంద్రారెడ్డికి తొలి జాబితాలోనే టికెట్ క‌న్ఫర్మ్ చేశారు.

శంకర్ యాదవ్ ను తప్పించి...
అయితే.. తంబ‌ళ్లప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా బీసీ నేత శంక‌ర్ యాద‌వ్ ఉన్నారు. తొలుత ఈయన‌కే టికెట్ ఇవ్వాల‌ని అనుకున్నా.. ఆర్థిక బ‌లాబలాల నేప‌థ్యంలో జ‌య‌చంద్రారెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. అయితే.. ఇప్పుడు ఈ ఈక్వేష‌న్ స‌రికాద‌నే వాద‌న బ‌లంగా వినిస్తుండ‌డం గ‌మ‌నార్హం. చంద్రబాబు అనుకున్న స్థాయిలో జ‌య‌చంద్రారెడ్డి ఆర్థికంగా ఇక్కడ ఖ‌ర్చు పెట్టక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి తోడు ఎంత మంది రెడ్లు బ‌రిలో ఉన్నా.. పెద్దిరెడ్డి వ‌ర్గం ముందు.. వారు నిల‌బ‌డ‌గ‌లిగే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో.. జ‌య‌ను మార్చాలంటూ.. టీడీపీలోనే చ‌ర్చ సాగుతోంది.
క్షేత్రస్థాయిలో...
ఇదే విష‌యాన్ని పార్టీ క్షేత్రస్థాయిలో నాయ‌కులు కూడా తేల్చి చెప్పారు. దీనిపై గ‌త వారం నుంచి పెద్ద ఎత్తున నియోజ‌క‌వ‌ర్గంలో పోరు సాగుతోంది. పైగా.. జిల్లాలో యాద‌వ క‌మ్యూనిటీ కూడా.. త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్కాలని కోరుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ ఇన్‌చార్జ్, శంక‌ర్ యాద‌వ్‌ను ఇక్కడ నిల‌బెట్టాలన్నది టీడీపీ క్షేత్రస్థాయి నాయ‌కులు చేస్తున్న ప్రధాన డిమాండ్‌.దీంతో ఇప్పుడు ఈ వ్యవ‌హారం.. చంద్రబాబు కోర్టుకు చేరింది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
మార్పు తప్పదనే...
అయితే.. ఆర్థికంగా తంబ‌ళ్లప‌ల్లెలో నిల‌దొక్కుకుని.. వైసీపీ అభ్యర్థిని ఓడించే స‌త్తా ఉన్న నాయ‌కుడు కోసం చంద్రబాబు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఇంచార్జ్‌శంక‌ర్ యాద‌వ్‌కు ఇవ్వాల‌నేది స్థానిక టీడీపీ నాయ‌కుల డిమాండ్. కానీ, ఇటు సామాజిక వ‌ర్గం ప‌రంగానే కాకుండా.. పెద్దిరెడ్డి వంటిబ‌లమైన వ‌ర్గాన్ని ఢీకొట్టే స్థాయిలో ఉండే నాయ‌కుడి కోసం చంద్రబాబు ప్రయ‌త్నించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఎలా చూసుకున్నా.. తంబ‌ళ్ల ప‌ల్లెలో మార్పు త‌ప్పద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఎవ‌రికి అవ‌కాశం చిక్కుతుందో చూడాలి.


Tags:    

Similar News