Nara Lokesh : లోకేష్ మంగళగిరిని దాటడం లేదే.. ఎందుకిలా? లక్కు ఎలా ఉంది?
టీడీపీ యువనేత నారా లోకేష్ గత కొద్ది రోజులుగా మంగళగిరిలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు
టీడీపీ యువనేత నారా లోకేష్ గత కొద్ది రోజులుగా మంగళగిరిలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ మంగళగిరికే పరిమితం కావడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకూ ఆయన మంగళగిరిని వదిలి బయట నియోజకవర్గాలకు ప్రచారానికి రాలేేదు. ఒకవైపు తన తండ్రి చంద్రబాబు ఏడు పదుల వయసులో ప్రజాగళం పేరుతో యాత్రను చేస్తున్నారు. నియోజకవర్గాలను చుట్టివస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా కూటమి తరుపున ప్రచారంలో పాల్గొంటూ నేతలు మాత్రమే కాదు క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు.
అక్కడే ప్రచారం చేస్తూ...
కానీ లోకేష్ మాత్రం మంగళిగిరి దాటి ముందుకు వెళ్లడం లేదు. ఉండవల్లి కరకట్ట మీద నుంచి ఉదయాన్నే బయలుదేరడం, మంగళగిరిలో వివిధ వర్గాలను కలస్తూ ఈసారి తనను గెలిపించాలని ఆయన కోరుతున్నారు. ఈసారి లోకేష్ కు గెలుపు అతి ముఖ్యం. పోయిన సారి ఓటమి పాలయి నవ్వులపాలయ్యారు. అయితే అదే మంగళగిరిని లోకేష్ వదలలేదు. తాను అక్కడి నుంచే పోటీ చేసి గెలిచి తీరతానంటూ శపథం పట్టినట్లే కనిపిస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వేరే నియోజకవర్గానికి వెళితే పారిపోయాడన్న అప్రదిష్టను మూటగట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే తాడోపేడో ఇక్కడే తేల్చుకోవాలని లోకేష్ డిసైడ్ అయినట్లున్నారు.
ఓడిన చోట నుంచే...
తొలుత పెనమలూరు నుంచి పోటీ చేస్తారని చెప్పినా.. జాబితాలో లోకేష్ పేరు మంగళగిరిలోనే కనపడింది. అయితే ఈసారి అక్కడ వైసీపీ వ్యూహం మార్చింది. అక్కడ చేనేత సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటంతో అక్కడ వైసీపీ అభ్యర్థిగా లావణ్యను ఖరారు చేసింది. దీంతో గెలుపు అన్నది అంత సులువు కాదన్నది లోకేష్ కు తెలియంది కాదు. ఏపీలో క్యాస్ట్ కు బలమెక్కువ. లావయ్య చేనేత సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో లోకేష్ గెలుపు కోసం శ్రమిస్తున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం అమరావతి రాజధాని పరిధిలో ఉన్నప్పటికీ అక్కడ గెలుపు టీడీపీకి ఈజీ కాదు. టీడీపీ గెలిచి కొన్ని దశాబ్దాలవుతుంది. మరోవైపు కమ్యునిస్టులు కూడా ఇక్కడ పోటీకి దిగుతున్నారు.
ఇంటింటికీ తిరుగుతూ...
అయితే జనసేన అండ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. రాజధానిని వైసీపీ ఇక్కడ అభివృద్ధి చేయలేదన్న నినాదంతో లోకేస్ మరోసారి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ తాను గెలిస్తే రాజధాని మాత్రమే కాకుండా అభివృద్ధి పనులు ఏం చేస్తానో చెబుతూ జనంలోకి వెళుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కమ్యునిటీ మీటింగ్ లు పెడుతున్నారు. తన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కంటే జగన్ పైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేసి తిరిగి పార్టీలోకి రావడంతో కొంత ఆ పార్టీలో ఊపు వచ్చింది. దీంతో లోకేష్ ఇక్కడి నుంచి కదలకుండా మంగళగిరిని ఎలాగైనా కొట్టేయాలన్న కసితో ఉన్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.