Chandrababu : ఈ అబ్బి ఇస్తాడా ఏందీ? ఇప్పుడు వచ్చేది పోగొట్టుకోవడమెందుకయ్యా సామీ?
తెలుగుదేశం పార్టీ మ్యానిఫేస్టో విడుదల చేసి పదిరోజులు దాటింది. అయితే మ్యానిఫేస్టోపై ప్రజల్లో పెదవి విరుపులే కనిపిస్తున్నాయి
తెలుగుదేశం పార్టీ మ్యానిఫేస్టో విడుదల చేసి పదిరోజులు దాటింది. అయితే మ్యానిఫేస్టోపై ప్రజల్లో పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా మ్యానిఫేస్టోను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంపై పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. చంద్రబాబు ప్రసంగాల్లో ఎక్కువగా జగన్ ను తిట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత మ్యానిఫేస్టోలో తాము రూపొందించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. జనంలో మ్యానిఫేస్టోను చర్చను పెద్దయెత్తున పెట్టాల్సిన సమయంలో ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న చర్చ అయితే మొదలయింది. 2019 ఎన్నికల్లోనూ లక్ష కోట్లు అవినీతి అంటూ జగన్ పై చంద్రబాబు పెద్దయెత్తున ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించలేదు.
సేమ్ ఫార్ములా...
2024 లోనూ అదే ఫార్ములాను చంద్రబాబు అనుసరిస్తున్నాడు. జగన్ పై ఎంత బురద జల్లితే అంత డ్యామేజీ అవుతుందనే కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు తప్పించి తాము అధికారంలోకి వస్తే తాము చెప్పిన పథకాలను అమలు చేస్తామని, దానికి డెడ్ లైన్ ను కూడా చెప్పలేకపోతున్నారంటే ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి గ్యారంటీలతో పాటు డెడ్ లైన్ పెట్టడమేనని అందరూ అంగీకరించేదే. తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ బలంగా చెప్పడంతోనే అక్కడి ప్రజలు విశ్ససించారు. ఖచ్చితంగా తమ ఓటు తమకు గ్యారంటీగా పథకాలను తెచ్చి పెడుతుందన్న నమ్మకాన్ని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు అక్కడ ఇవ్వగలిగారు.
అదే ఎప్పుడు?
కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇందుకు పరిస్థితి విరుద్ధంగా ఉంది. సూపర్ సిక్స్ తో పాటు చంద్రబాబు మ్యానిఫేస్టోలో అనేక పథకాలను ప్రకటించారు. అన్నీ ఆకట్టుకునేవే. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒక్కొక్క గ్యారంటీ ఎప్పుడు అమలు చేస్తామన్నది లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెబుతున్నారు కానీ పథకాలకు డెడ్ లైన్ లేకపోవడంతోనే అసలు సమస్యగా మారింది. ప్రజలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇదంతా హంబక్ అని చర్చించుకునే పరిస్థితిని స్వయంగా కూటమి నేతలే తెచ్చుకున్నారు. ఒకవైపు చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫేస్టో అమలు చేయాలంటే ఏడాదికి 1.50 లక్షల కోట్లు కావాలని, పథకాలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయరని, లబ్దిదారులను కుదిస్తారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తుంటే కూటమి నేతలు కేవలం జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
నష్ట నివారణ చర్యలు చేపట్టకుంటే...?
ప్రస్తుతం పేదవర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. అతిగా ఆశపడటం కంటే వచ్చే డబ్బులు ఏదో ఠంచనుగా బ్యాంకుల్లో వచ్చిపడుతుండటం బెటర్ కదా? అన్న భావనలోకి సగం మంది వచ్చేశారు. చంద్రబాబు పథకాలను అమలు చేయరనే అపనమ్మకం మరింత పెరిగే అవకాశముంది. జగన్ కు ఓటేస్తే చెప్పినవి చెప్పినట్లు చేస్తాడన్న అభిప్రాయమూ ఎక్కువ మందిలో కనపడుతుంది. అందుకే పూర్తిగా కూటమి ఇబ్బందులు ఎదుర్కొనక ముందే టీడీపీ నేతలు మేల్కోవాల్సి ఉంది. లేకుంటే అసలుకే ఎసరు వస్తుంది. గ్రామాల్లోనూ, పేద వర్గాల్లోనూ బలంగా వెళ్లగలిగితేనే కూటమికి విజయం దక్కుతుంది. ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ మూడు రోజుల్లో ఆ విశ్వాసాన్ని కల్గించలేకపోతే మాత్రం... కూటమి ఈ ఎన్నికల్లో ఇబ్బందులు పడక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.