Tg Venkatesh : బాసూ ఏం జరుగుతుందో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోవూ? నరాలు తెగిపోతున్నాయ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో సీనియర్ రాజకీయ నేతగా టీజీ వెంకటేశ్ అందరికీ సుపరిచితుడు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన నేత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో సీనియర్ రాజకీయ నేతగా టీజీ వెంకటేశ్ అందరికీ సుపరిచితుడు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన నేత. ఆయన ఎప్పుడు మాట్లాడినా వివాదమే. కాదు.. వివాదాలనే ఆయన ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఆయన మాట్లాడే ప్రతి మాట మీడియాలో హైలెట్ అవుతుంటుంది. వైశ్య సామాజికవర్గానికి చెందిన టీజీ వెంకటేశ్ ధైర్యంగా ఏదైనా చెప్పగలడంలో దిట్ట. తనను ఎవరో వచ్చి ఏదో చేస్తారని, తన వ్యాపారాలపై తన మాటల ప్రభావం చూపుతుందని ఆయన వెనక్కు తగ్గరు. అలా అనేకసార్లు వివాదాలను కొని తెచ్చుకున్నారు. కాంట్రవర్సీ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ కేసీఆర్ పై వ్యతిరేకంగా చేసి టీజీ వెంకటేశ్ తన ధైర్యమేంటో చెప్పకనే చెప్పారు. హైదరాబాద్ లో ఆయనకు ఆస్తులున్నా లెక్క చేయలేదు.
పేరున్న నేతగా...
అయితే టీజీ వెంకటేశ్ రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ లో ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. వ్యాపారాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా భారీగానే చేపడతారు. కర్నూలు కేంద్రంగా ఆయన చేసే సేవా కేంద్రాల కారణంగానే ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా ఆదరించారు. ఆయన కుటుంబానికి కూడా అదే రకమైన ప్రతిష్టను సంపాదించిపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత టీజీ వెంకటేశ్ కాంగ్రెస్ ను వదిలి పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే 2014లో గెలవలేకపోవడంతో ఆయన టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన వెంటనే అందరితో పాటు టీజీ వెంకటేశ్ కూడా బీజేపీలో చేరిపోయారు. ఆయన కుమారుడు టీజీ భరత్ ను మాత్రం టీడీపీలోనే ఉంచారు. టీజీ భరత్ కర్నూలు శాసనసభ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి కూడా. కానీ టీజీ వెంకటేశ్ మాత్రం బీజేపీలోనే ఉన్నారు.
ఎన్నికల తర్వాత...
2024 ఎన్నికల ముందు వరకూ కూటమి ఏర్పడేంత వరకూ అనేక రకాలైన కామెంట్స్ ఆయన చేశారు. మూడు పార్టీలు కలిస్తే మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని ముందుగానే జోస్యం చెప్పారు. రాజ్యసభ పదవి పూర్తయినా ఆయన బీజేపీలోనే ఉన్నట్లు తెలిపారు. తన కుమారుడు టీజీ భరత్ టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అయితే ఆయన బీజేపీకి మద్దతుగా ఎక్కడా పెద్దగా ప్రచారం చేసినట్లు కనపడలేదు. కేవలం కర్నూలుకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. కర్నూలులో ఈసారి తన కుమారుడు ఖచ్చితంగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉన్న టీజీ వెంకటేశ్ గట్టిగా పోరాడారంటున్నారు. ఆయన తనకున్న శక్తియుక్తులన్నీ కర్నూలు నియోజకవర్గంలోనే ప్రయోగించారని సన్నిహితులు చెబుతున్నారు.
నాడిని పసిగట్టడంలో...
వైశ్య సామాజికవర్గలో పట్టున్న నేత అయిన టీజీ వెంకటేశ్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఆయన ఎక్కడా మాట్లాడింది లేదు. సహజంగా టీజీ వెంకటేశ్ నోరును అదుపు చేయలేం. ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఫలితాలను కూడా విశ్లేషించే శక్తి ఆయనకుంది. ప్రజల నాడిని కూడా పసిగట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. అయినా టీజీ వెంకటేశ్ మాత్రం మౌనంగానే ఉండటం ఇప్పుడు కూటమిలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని చూసి ఆయన మాట్లాడటం లేదా? లేక ఏదైనా ఆయనకు ఉప్పందిందా? అన్న అనుమానం కూడా ఆయనకు దగ్గరి వారిలో వ్యక్తమవుతుంది. మొత్తం మీద టీజీ వెంకటేశ్ పోలింగ్ తర్వాత కూడా మౌనంగా ఉండటం చూస్తే ఏదో అందినట్లుందన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది.