Nellore : నెల్లూరు నెంబర్ మారనుందా? ఈసారి ఎవరి జాతకాలు తిరగబడనున్నాయి?
నెల్లూరు జిల్లాలో ఈసారి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్నదానిపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి
నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట. 2014లో అత్యధిక స్థానాలను సాధించిన ఆ పార్టీ 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. పాత నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా గెలిచింది. ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. నెల్లూరు జిల్లాలో పట్టున్న వైసీపీ అదే పంధాను కొనసాగిస్తుందా? లేక ఈసారి ఎన్నికల్లో చతికలపడుతుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరులో టీడీపీ కొంత మేర బలంగా ఉన్నా గత ఎన్నికల్లో మాత్రం పూర్తిగా దెబ్బతినింది. ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ ఈసారి అత్యధిక స్థానాలను గెలిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.
సీన్ మారడంతో...
అయితే 2019 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు.. 2024 పొలిటికల్ సీన్ వేరు. చాలా మారింది. అనేక రాజకీయ కుటుంబాలు వైసీపీకి దూరమయ్యాయి. గత ఎన్నికల్లో అండగా ఉన్న కుటుంబాలు దూరం కావడం కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశముందన్నది పరిశీలకుల అంచనాగా వినిపిస్తుంది. మెజారిటీ స్థానాలను సాధించుకోవాలన్నా కొన్ని కీలక కుటుంబాలు దూరం కావడంతో వైసీపీ కొంత కష్టాలతో ఎదురీతున్నట్లే కనపడుతుంది. ఒకటా రెండా... ఆనం, వేమిరెడ్డి, మాగుంట కుటుంబాలు వైసీపీకి దూరమయ్యాయి. గత ఎన్నికల్లో ఈ కుటుంబాలు వైసీపీకి అండగా ఉండటంతో స్వీప్ చేయడం సాధ్యమయిందన్న లెక్కలు వినిపిస్తున్నాయి.
బలమైన కుటుంబాలను...
బలమైన వేమిరెడ్డి, మాగుంట కుటుంబాలు దూరం కావడంతో రెడ్డి సామాజికవర్గంలో కూడా కొంత మార్పు కనిపిస్తుందంటున్నారు. ముఖ్యంగా సులువుగా గెలుచుకోవాలనుకున్న నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, కోవూరు, గూడూరు, కావలి, వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో టీడీపీ మరింత బలపడిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ కుటుంబాలు దూరమయిన కారణంగా వైసీపీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అదే సమయంలో నెల్లూరు జిల్లాలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన మద్దతుతో పాటు బీజేపీ అండ ఉండటం కూడా కొంత మేర లాభిస్తుందని అంటున్నారు.
రెడ్డి సామాజికవర్గంలోనూ...
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన వర్గం కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తుంది. మరోవైపు రెడ్డి సామాజికవర్గంలోనూ వైసీపీ నాయకత్వం తమను పట్టించుకోలేదన్న అభిప్రాయమయితే బలంగా ఉంది. ఇలా వైసీపీ హైకమాండ్ తన చేతులారా కీలక నేతలను దూరం చేసుకుని విజయాన్ని కూడా కష్టతరం చేసుకుందన్న అభిప్రాయం మాత్రం కిందిస్థాయి క్యాడర్ నుంచి వినపడుతుంది. జగన్ మాత్రం తనకు ఉన్న ఓటు బ్యాంకు వేరే అని, వాళ్లు తనకు అండగా ఉంటే చాలునన్న అభిప్రాయంతో ఉన్నారు. త్వరలోనే జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నెల్లూరు జిల్లాకు రానుంది. అప్పటికి ఆయన పరిస్థితుల్లో ఏమైనా మార్పులు తెస్తారా? అని ఆశతో ఫ్యాన్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.