Ap Politics : మ్యానిఫేస్టో విడుదల తర్వాత ఛేంజ్.. ఓటు బ్యాంక్ టర్న్ అయిందా?
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. రెండు ప్రధాన పార్టీలూ తమ మ్యానిఫేస్టోను విడుదల చేశాయి.
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు ఇంకా పన్నెండురోజులు మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు ప్రధాన పార్టీలూ తమ మ్యానిఫేస్టోను విడుదల చేశాయి. వైసీపీ ఈ నెల 27వ తేదీన మ్యానిఫేస్టో విడుదల చేయగా, టీడీపీ, జనసేన కూటమి మాత్రం నిన్న విడుదల చేసింది. రెండు పార్టీలూ అధికారం వైపు అడుగులు వేసే దిశగా మ్యానిఫేస్టోను రూపొందించాయని చెప్పాలి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మ్యానిఫేస్టోను రూపొందించాయి. అయితే అధికార వైసీపీ కంటే టీడీపీ, జనసేన కూటమి రెండు ఆకులు ఎక్కువే మ్యానిఫేస్టోలో చేర్చినట్లు కనిపించింది. జగన్ మ్యానిఫేస్టోలో కొత్త హామీలు అంటూ పెద్దగా ఏమీ లేవు. అదే టీడీపీ కూటమి మ్యానిఫేస్టోలో మాత్రం అంతా కొత్తదనమే.
టీడీపీ మ్యానిఫేస్టోకు..
2014 ఎన్నికలకు సంబంధించిన విడుదల చేసిన మ్యానిఫేస్టోకు 2024 మ్యానిఫేస్టోకు టీడీపీ మ్యానిఫేస్టోలో చాలా తేడా కనిపించింది. అయితే ఈసారి మ్యానిఫేస్టోలో చంద్రబాబు కాస్త చిక్కీ చిక్కనట్లు.. అందీనట్లు రూపొందించినట్లే కనపడుతుంది. రైతుల రుణమాఫీ ప్రస్తావన గురించి అసలు లేనే లేదు. అదే సమయంలో డ్వాక్రా రుణాల రద్దు కూడా అస్సలు లేదు. కాకుంటే డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలను అందచేస్తామని మాత్రం చెప్పారు. రైతుల విషయానికి వస్తే రుణమాఫీ లేకుండా పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థికసాయాన్ని ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతే తప్ప రైతులు, డ్వాక్రామహిళల రుణాల రద్దు మాత్రం లేకపోవడం ఒకింత ఆలోచించ దగ్గ విషయమే.
వైసీపీ విషయానికి వస్తే...
వైసీపీ విషయానికి వచ్చే సరికి తాము చెప్పినవే చేస్తాం కాబట్టి కొత్త హామీలను చేర్చడం లేదని చెబుతుంది. పాత పథకాలకే కొంత నగదును పెంచి మ్యానిఫేస్టోలో చోటు కల్పించారు. పోలవరం ప్రస్తావన అసలు మ్యానిఫేస్టోలో లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాన్ని కూడా జగన్ పట్టించుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ పూర్తయ్యే దశలో ఉన్నాయి కాబట్టి పోలవరం ప్రస్తావన తేలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రత్యేకంగా జగన్ ప్రస్తావించలేదు. వారికి రావాల్సిన బకాయీలను మాత్రమే ఇస్తామని చెప్పి ముగించారు తప్పించి మరొక వాగ్దానం వారికి ఇవ్వకుండా దాట వేశారు. చంద్రబాబు కూడా సీపీఎస్ పై ప్రత్యేకంగా హామీ ఇవ్వలేదు. తాము ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామనే చెప్పారు తప్పించి ఆయన దానిని అమలు చేస్తామని చెప్పలేకపోయారు.
ఓటు బ్యాంకుల్లో కొంత...
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంత వైసీపీ వైపు టర్న్ అయినట్లు కనిపిస్తుంది. చంద్రబాబు ప్రకటించిన హామీలు అమలయితే తమకు జీతాలు కూడా వచ్చే పరిస్థితులు ఉండవన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. అలాగే వైసీపీ మ్యానిఫేస్టో తర్వాత పింఛను దారులలో కొంత టర్న్ తీసుకున్నారంటున్నారు. జగన్ 3,500 రూపాయల పింఛను 2029 లో ఇస్తానని చెబితే.. చంద్రబాబు మాత్రం ఏప్రిల్ నెల నుంచే నాలుగువేల రూపాయలు చెల్లిస్తామని చెప్పడంతో వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు కొంత టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో నిన్నటి వరకూ మధ్యతరగతి ప్రజలు టీడీపీ వైపు ఉన్నారనిపించినా...టీడీపీ మ్యానిఫేస్టో చూసిన తర్వాత జగన్ బెటర్ అన్న భావనకు వచ్చినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద మ్యానిఫేస్టో విడుదల తర్వాత కూడా రెండు పార్టీలకు సంబంధించి ఓటు బ్యాంక్ లలో కొంత గండి పడే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. కానీ ఓట్ల శాతం ఎవరికి తగ్గుతుందన్నదే ఇప్పుడు ప్రశ్న.