Ap Elections : మహిళలే క్యూ కట్టారంటే.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఓటర్లు ఎక్కువ. 154 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఓటర్లు ఎక్కువ. 154 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. మహిళలు ఎటు వైపు మొగ్గుచూపితే వారిదే అధికారం. గత ఎన్నికల్లోనూ మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాలకు రాత్రి ఏడు గంటల వరకూ వస్తూనే ఉన్నారు. పెద్దయెత్తున మహిళలు తరలి రావడంతో పాటు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ లో ఉండటంతో పోలింగ్ ను కొన్ని చోట్ల రాత్రి ఎనిమిది గంటల వరకూ కొనసాగించారు. మహిళలు పెద్దయెత్తున తరలి రావడంతో తమకు అనువుగా మారుతుందని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది.
గత ఎన్నికల్లో...
పసుపు కుంకుమ పేరిట పది వేల రూపాయలు నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేయడంతో ఈ ఓట్లన్నీ తమకేనని అప్పట్లో టీడీపీ ఆశలు పెట్టుకుంది. పోలింగ్ ముగిసిన తర్వాత 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే అంచనా వేశారు. మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో తమ విజయం ఖాయమయిందని చెప్పేశారు. తీరా రిజల్ట్ చూస్తే మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా 23 స్థానాలకే టీడీపీ పరిమితమయింది. అంటే మహిళలు ఎక్కువ భాగం నాటి ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశారనే అనుకోవాలి. దానికి గల కారణాలు గురించి ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన పనిలేకపోయినా ఈసారి కూడా మహిళలు అధిక సంఖ్యలో ఓటు ఎవరికి వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మ్యానిఫేస్టోలో చెప్పినట్లు...
ప్రభుత్వంపై వ్యతిరేకత మహిళల్లో ఉందని టీడీపీ గట్టిగా నమ్ముతుంది. అభివృద్ధి లేకపోవడంతో పాటు మద్యనిషేధం చేయకపోవడంతో పాటు శాంతిభద్రతల సమస్య తలెత్తుతుండటం కూడా మహిళలు తమ వైపు ఈసారి మొగ్గు చూపుతారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు తాము ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు కూడా మహిళలు తమ వైపు ఆకర్షితువడానికి కారణాలుగా చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, తల్లికి వందనం పేరిట ఎంత మంది కుటుంబంలో ఉన్నా వారందరికీ ఇస్తామని ప్రకటించడం తమకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. దీంతో పాటు 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామని చెప్పడం కూడా తమకు కలసి వస్తుందని అంటున్నారు.
పథకాలన్నీ...
కానీ అధికార వైసీపీ ఆలోచన, అంచనా మరోరకంగా ఉంది. ఈ ఐదేళ్లలో మహిళలకు తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వంలో ఇవ్వలేదని చెబుతున్నారు. అందులోనూ పథకాలన్నీ వారి పేరు పైనే ఇవ్వడం, వారి బ్యాంకు ఖాతాల్లోనే వివిధ పథకాల కింద నగదును జమ చేయడంతో పాటు వారికి రాజకీయంగా, నామినేటెడ్ పదవుల్లోనూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాళ్లంతా తమ వైపు మొగ్గు చూపుతారని వైసీీపీ నేతలు చెబుతున్నారు. మహిళలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రయారిటీని చూసిన తర్వాత వాళ్లు పక్క చూపులు చూసే అవకాశం లేదన్న ధీమా ఫ్యాన్ పార్టీ నేతల్లో కనపడుతుంది. మొత్తం మీద మహిళ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే అధికారమన్నది వాస్తవం. అందుకే ఈసారి మహిళలపై అన్ని పార్టీలూ ఆశలు పెట్టుకున్నాయి.