Ys Jagan : పదిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం.. మంచి చేస్తేనే ఓటేయండి

రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదలకు ఏం చేశారని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు

Update: 2024-05-03 07:11 GMT

రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదలకు ఏం చేశారని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. నరసాపురంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. పదిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని, జగన్ కు ఓటేస్తే పధకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు తప్పదని హెచ్చరించారు. గత యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇన్ని పథకాలు ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారా? అని జగన్ ప్రశ్నించారు. గతంలో ఎప్పుడైనా అవ్వాతాతలకు ఇంటి వద్దకు పింఛను తీసుకువచ్చిన పరిస్థితి ఉందా? అని అడిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కింద బాగుచేసి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.

చంద్రబాబు పేరు చెబితే...
చంద్రబాబు పేరు చెబితే గత పథ్నాలుగేళ్లలో ఒక్క పధకమైనా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేచి రక్తం తాగుతుందని అన్నారు. నాడు నేడుతో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని తెలిపారు. విదేశీ విద్యకింద అనేక మందిని ప్రోత్సహించామని తెలిపారు. పూర్తిస్థాయి ఫీజు రీఎంబర్స్‌మెంట్ చేస్తూ పేదల విద్య కోసం ఈ ప్రభుత్వం ఎంత పాటుపడిందో మీకు తెలియదా? అని జగన్ ప్రశ్నించారు. అక్కాచెల్లెమ్మల పేరిట 36 లక్షల పక్కా ఇళ్లను మంజూరు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎవరి ప్రభుత్వంలో మహిళా సాధికారికత జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు. ప్రతి విషయంలో ఆలోచన చేసి ఓటు వేయాలని జగన్ కోరారు.
ఎప్పుడూ చూడని విధంగా...
కేవలం యాభై ఎనిమిది నెలల్లో మాత్రమే అమలయిన పథకాలను చూడాలని కోరారు. రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఇస్తున్నామని చెప్పారు. రైతు భరోసా, పగటి పూట నాణ్యమైన విద్యుత్తు 9 గంటల సరఫరా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రైతన్నలకు అండగా నిలిచిన ప్రభుత్వం ఇది కాదా? అని అన్నారు. వైద్యం కోసం ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకూ విస్తరించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఫ్యామిలీ డాక్టర్ ను ప్రవేశపెట్టింది మీ బిడ్డ పాలనలోనే కాదా? అని అన్నారు. ఆలోచన చేయమని అడుగుతున్నానని అన్నారు. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా? అంటూ ప్రశ్నించారు. చిరు వ్యాపారులకు కూడా జగనన్న తోడు, జగనన్నచేదోడు పథకాలతో అండగా నిలిచింది ఎవరు అని జగన్ ప్రశ్నించారు.
ఓటు వేయని వారికి కూడా...
గత ఎన్నికల్లో ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. ఇంట్లో కూర్చుని అందరితో మాట్లాడాలని, ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మరీ ఓటు వేయాలన్నారు. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, లంచాలు లేని పాలన కావాలన్నా, పేద వాడి భవిష్యత్ బాగుపడాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ పై నొక్కాలని పిలుపు నిచ్చారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ గెలవాల్సిందేనని అన్నారు. చంద్రబాబు చేసే మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని అన్నారు. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని, చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలన్నారు. అందరూ వైసీపీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడని, మిగిలిన వారంతా మరొక వైపు ఉన్నారన్నారు.


Tags:    

Similar News