YSRCP : పింఛను నిలుపుదలపై తొలిసారి స్పందించిన జగన్

వైసీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలను అందించామని వైసీపీ అధినేత జగన్ అన్నారు

Update: 2024-04-02 13:14 GMT

పింఛను ఇంటికి వెళ్లి ఇవ్వాలని వాలంటీర్ల వ్యవస్థను తెస్తే చంద్రబాబు దానిపై కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారన్నారు. మదనపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఏప్రిల్ నెల పింఛనును ఆపేయించాడన్నారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలను అందించామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేయించే పనిని చేస్తున్నాడన్నారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కూడా పథకాలు అందించామని తెలిపారు. ఈ ప్రభుత్వం మంచి చేయకపోతే ఇంత మంది కలసి తనపై యుద్ధానికి దిగుతారా? అని ఆయన ప్రశ్నించారు. కేవలం వైసీపీకి మాత్రమే ఇంటికి వెళ్లి ఓటు వేయాలని అడిగే నైతిక హక్కు ఉందని ఆయన అన్నారు. తనను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని అన్నారు. 99 మార్కులు వచ్చిన విద్యార్థి పరీక్షకు భయపడతాడా? పది మార్కులు రాని వారు పరీక్షల్లో పాస్ అవుతారా? అని ఆయన ప్రశ్నించారు. బీసీలను తోకకత్తిరిస్తామని చంద్రబాబు నాడు అన్న మాటలు గుర్తుకు లేవా? అని ప్రశ్నించారు.

తోడేళ్ల గుంపులా కలసి వస్తున్నారు...
అధికారం కోసం తోడేళ్ల గుంపులా అందరూ కలసి వస్తున్నారన్నారు. తన ఒక్కడిపై ఇంత మంది దాడికి దిగారన్న జగన్ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని ఆయన అన్నారు. ఒక్కరూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలను అందరికీ అందించామని తెలిపారు. ఇదే మన ట్రాక్ రికార్డు అని ఆయన అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని, అదే జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు వాలంటీర్ల వ్యవస్థ గుర్తుకు వస్తుందని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీతో కలసి తనపై యుద్ధానికి వస్తున్నారని అన్నారు. 2.75 లక్షల కోట్లు బటన్ నొక్కి లబ్ది దారుల ఖాతాల్లో పడ్డాయంటే ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో చెప్పాల్సిన పనిలేదన్నారు.
ఎన్నడూ జరగని విధంగా...
విద్య, వైద్య రంగాలను పేదల ముంగిటకు తీసుకెళ్లేందుకే తన ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయడానికి డబ్బు కోసం వెనకాడ లేదన్నారు. రైతుల కోసం ఇన్ని పథకాలను అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చామని తెలిపారు. విశ్వసనీయత లేని కూటమి నిలబడుతుందా? అని జగన్ ప్రశ్నించారు. మేనిఫేస్టోను తాము పవిత్ర గ్రంధంలా భావించామని, టీడీపీ మాత్రం దానిని గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి జరిగిందని, మెడికల్ కళాశాలలు, పోర్టులు ఏర్పాటు చేసుకుంటూ వెళుతున్నామని అన్నారు.
ఇచ్చిన హామీలన్నింటినీ...
పేదల రక్తాన్ని పీల్చేందుకు జనం ముందుకు వస్తున్నారని పసుపు పతి అని జగన్ అన్నారు. వదల బొమ్మాలి అంటూ మళ్లీ రంకెలు వేస్తున్నాడన్నారు. 2014లో మ్యానిఫేస్టోలో చెప్పిన ఒక్క అంశాన్ని కూడా అమలుచేయలేదన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేస్తానన్న హామీని తుంగలో తొక్కారన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానని చేశాడా? అని ప్రశ్నించారు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాడన్నాడని, మదనపల్లెలో ఏమైనా కన్పించిందా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన హామీలనే చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. మరి ఆయనను నమ్మి ఓటు వేయడం అవసరమా? అని నిలదీశారు. మళ్లీ ఇదే ముగ్గురు కలసి మరో మ్యానిఫేస్టోతో మాయ చేయడానికి మీ ముందుకు వస్తున్నారన్నారు.


Tags:    

Similar News