కాటన్ బ్యారేజీ వద్ద డేంజర్.. డేంజర్
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద గంటగంటకూ పెరుగుతోంది.
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద గంటగంటకూ పెరుగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద 22 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. 18 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద తీవ్రత ఎక్కువగా ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో లంక గ్రామాలు తీవ్ర ఇబ్బందుల్లో పడనున్నాయి. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అనేక గ్రామాలు నీట మునగనున్నాయి.
రికార్డు స్థాయిలో...
ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఇంత స్థాయిలో భారీ వరద వస్తుందని అధికారులు సయితం ఊహించలేదు. ప్రస్తుతం ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 22 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2020 సంవత్సరంలో ఈ స్థాయి వరద వచ్చింది. అత్యధికగంగా 1986లో 30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. 1953లో 26 లక్షల క్యూసెక్కుల నీరు వరద వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అధికారులు ఊహించని విధంగా ఈసారి వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు కూడా హైరానా పడుతున్నారు.
ముప్పు పొంచి ఉన్న గ్రామాలు...
మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో 36 లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తోకలంక, ఉబలంక, సిరిలంక, కోటిపల్లి, బడుగువానిలంక, అప్పనరాముని లంక, పల్లపులంక, అద్దంకి వారి లంక, ఠాణేలంక, పల్లిగూడెం, బాడవ, పల్లంకుర్రు, నడవపల్లి, బ్రహసమేధ్యం, మగసానితిప్ప, కుండలేశ్వరం, బోడసకుర్రు, నారాయణలంక, వీధివారి లంక, కేదారి లంక, పెదపూడి, ఊడుముడిలంక, అరిగెలవారి లంక, పి.గన్నవరం, బూరుగులంక, వాకలగరువు, తొండవరం, పెదపట్నంలంక, మామిడి కుదురు, అప్పనపల్లి, అయినవిల్లి, వీరపల్లి పాలెం, కొండకుదురు, చింతనలంక, మడుపల్లి, తోటరాముడి అయినవిల్లి, బండారులంక, కామిని, ముమ్మిడివరం అమలాపురం, చింతపల్లిలంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకోకున్నాయి. ఈ గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.