మోదీతో జగన్ అరగంట భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట సేపు ఈ భేటీ జరిగింది
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట సేపు ఈ భేటీ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల్లోపు తాము పోలవరం పూర్తి చేయాల్సిన అవసరాన్ని జగన్ మోదీకి వివరించారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టకు 55,548 కోట్లు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కేంద్రం ఇవ్వాలని జగన్ ప్రధాని మోదీని కోరినట్లు తెలిసింది.
విద్యుత్తు బకాయీలు...
అయితే దీనికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి హామీ లభించినట్లు సమాచారం. దీంతో పాటు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన తెలంగాణ విద్యుత్తు బకాయీల విషయంపై కూడా చర్చించారు. తెలంగాణ నుంచి ఆరువేల కోట్లు విద్యుత్తు బకాయీలు రావాలని, వాటిని ఇప్పించేలా కృషి చేయాలని జగన్ కోరారు. దీంతో పాటు నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వాలని కోరారు. ఇక అమలు కాని విభజన అంశాలపై జగన్ మోదీకి వినతిపత్రాన్ని సమర్పించారని తెలిసింది. ప్రధానిని కలిసినప్పుడు జగన్ వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.