AP Cabinet: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన

Update: 2024-07-25 13:54 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ క్యాబినెట్ సమావేశానికి మంత్రులు, అధికారులు పలువురు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. శుక్రవారం నాడు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుండగా.. ఆ అంశాలు కూడా క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.

గురువారం ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శాంతిభద్రతలపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. శ్వేతపత్రంలోని అంశాలపై చంద్రబాబు స్పందించారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని.. టీడీపీ హయాంలో గతంలో హైదరాబాదులో మత కల్లోలాలను ఉక్కుపాదంతో అణచివేశామని చెప్పారు. గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లు ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా మనోవేదన అనుభవించారని, పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు జరిగాయని అన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని.. పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని, నిబంధనలు ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు.


Tags:    

Similar News