కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై నేటికీ ఉత్కంఠ నెలకొంది. అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఆయన అభిమానుల్లోనూ ఏం జరుగుతుందోనన్న సందిగ్ధత కనిపిస్తోంది. దానికి తోడు ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ రాజేశాయి. ఎన్టీఆర్ బీజేపీతో కలిసి పనిచేస్తారా? ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? అనే ప్రశ్నలు ఇటు అభిమానులు.. అటు తెలుగు తమ్ముళ్ల మెదళ్లను తొలుస్తున్నాయి. కొద్దిరోజులుగా ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది.
గతంలో తన తాత పెట్టిన పార్టీ కోసం ఊరూరా తిరిగి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. 2018 తెలంగాణ ఎన్నికల్లో తన అక్క పోటీ చేసినా ప్రచారానికి దూరంగానే ఉన్నారు. దీంతో చంద్రబాబు టీడీపీతో ఆయనకు దూరం పెరిగిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పటి నుంచి కెరీర్ మీదే ఫోకస్ పెట్టిన ఆయన రాజకీయాల గురించి వేదికలపై మాట్లాడేందుకు కూడా అయిష్టత చూపారు. ఇప్పుడు ఏకంగా అమిత్ షాతో భేటీ కావడంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన బీజేపీకి సపోర్ట్ చేయొచ్చని జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత టీజీ వెంకటేష్ కొంత క్లారిటీ ఇచ్చేశారు. సూటిగా సుత్తిలేకుండా చెప్పకపోయినప్పటికీ ఆయన బీజేపీలోకి వస్తారనే ప్రచారంపై మాత్రం స్పష్టత వచ్చేలా మాట్లాడారు.
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సమీకరణలు మారుతుంటాయని.. అందులో భాగంగానే ఎన్టీఆర్ కూడా అమిత్ షాతో భేటీ అయ్యారని ఆయన అన్నారు. అంతమాత్రాన ఆయన బీజేపీలో చేరుతున్నట్లు కాదని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో జనసేన పార్టీ తమకు మద్దతునిస్తోందని.. బీజేపీ పార్టీలతో పొత్తుల కోసం వెంటపడడం లేదన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. అవసరమైన సమయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. గత ఎన్నికల ముందు వరకూ టీడీపీలో కొనసాగిన టీజీ.. ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.