మిస్టరీగానే కారు యజమాని మిస్సింగ్.. అసలేం జరిగింది ?

గమనించిన అటుగా వెళ్తున్న ఇసుక లారీ డ్రైవర్ గుర్తించి 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పెనమలూరు ఎస్ఐ అర్జున్..

Update: 2023-07-18 04:34 GMT

car owner missing mystery

అవనిగడ్డ కరకట్ట పై పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు యజమాని మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. సోమవారం తెల్లవారుజామున కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంటుమిల్లి సమీపంలోని రామవరపుమూడిలో గాజుల రత్నభాస్కర్ (43) ఐస్ కోల్డ్ స్టోరేజీ నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం అవనిగడ్డ. భార్య, కుమార్తె ఉన్నారు. మచిలీపట్నంలో జరుగుతున్న ఓ రాజకీయ పార్టీ సమావేశానికి వెళ్తున్నట్లు ఆదివారం (జులై16) ఇంట్లో చెప్పి కారులో బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామున పెదపులిపాక వంతెన సమీపంలో రత్నభాస్కర్ కారు స్థానిక కరవు కాల్వలో 90 శాతం వరకూ మునిగిపోయి ఉండగా.. హెడ్ లైట్లు వెలుగుతూ కనిపించాయి.

గమనించిన అటుగా వెళ్తున్న ఇసుక లారీ డ్రైవర్ గుర్తించి 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పెనమలూరు ఎస్ఐ అర్జున్ తన సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి వెళ్లి.. కారును నీటిలో నుంచి బయటకు తీయించి పరిశీలించారు. అప్పటికే కారు డోర్ తెరచి ఉండగా.. ఒక జత దుస్తులు డ్రైవర్ సీటు కింద ఉన్నాయి. డాష్ బోర్డులో ఉన్న పేపర్ల ఆధారంగా ఆ కారు రత్నభాస్కర్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించి.. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ప్రమాదానికి గురై కారు పంటకాలువలో పడటంతో.. రత్నభాస్కర్ బయటికి వచ్చారా ? వస్తే ఎక్కడికి వెళ్లినట్లు ? అసలు జరిగింది ప్రమాదమేనా లేక ఎవరైనా రత్నభాస్కర్ కు హాని తలపెట్టి కారును కాల్వలోకి తోసి ఉంటారా? నీటిలో గల్లంతై ఉంటే.. రత్నభాస్కర్ మృతదేహం ఏమై ఉంటుంది? మచిలీపట్నంలో సమావేశానికి వెళ్లిన రత్నభాస్కర్ పెదపులిపాక ఎందుకు వచ్చారు? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News