Andhra Pradesh : త్వరలో నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి అంటే?

మరో కీలక నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నట్లు తెలిసింది. నిరుద్యోగులకు మూడు వేలు భృతిని త్వరలోనే అందించనునున్నారు.

Update: 2024-09-29 04:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు పర్చలేదన్న విమర్శలను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకూ మహిళలకు ఉచిత బస్సు సౌక్యం కూడా కల్పించలేదు. అలాగే తల్లికి వందనం పథకం కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. పింఛన్లు పెంపుదల తప్పించి మిగిలిన హామీలను పక్కన పెట్టిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. హామీలు అమలు చేయకుండా వంద రోజుల పాలన నుంచి డైవర్ట్ చేయడానికే తిరుమల లడ్డూ వివాదాన్ని కూడా లైమ్ లైట్ లోకి తీసుకు వచ్చిందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

నిధుల లేమి కారణంగా...
అయితే నిధుల లేమితో వరసగా ఒక్కొక్క హామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దీంతో పాటు దీపావళికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తామని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా అందించనున్నారని మంత్రి చెబుతున్నారు. అంతకు ముందు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. 16 వేల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమయింది. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా అధికారంలోకి రాగానే చంద్రబాబు రద్దు చేశారు. ఊరూరా అన్న క్యాంటిన్లు పెట్టి పేదలకు ఐదు రూపాయలకే భోజనం, టిఫిన్లు అందచేస్తున్నారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసమే అయినా...?
అయితే తాజాగా మరో కీలక నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నట్లు తెలిసింది. తాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతిని అతి త్వరలోనే అందించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కసరత్తు చేయాలని చంద్రబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించడంతో ఎందరు నిరుద్యోగులున్నారు? ఎంత మంది గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు? వంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తు ఫారాన్ని సిద్ధం చేశారు. డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు, ఆధార్ జిరాక్స్ కార్డును జత చేసి స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించింది అయినా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబరు 6వ తేదీ వరకూ తమ వివరాలను నమోదు చేసుకునే వీలుంది. మరి నిరుద్యోగ భృతిని త్వరలోనే చంద్రబాబు ప్రకటించే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News