జనసేన రద్దు..బీజేపీలో విలీనం..ఖాయమన్న కాంగ్రెస్ నేత
పవన్ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సూచించారు;

పవన్ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సూచించారు. పవన్‌ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటినుండి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ళు ముగ్గురూ కీలు బొమ్మలని అంటున్నామని, అది నిజమని పిఠాపురం జన సేన సభ నిరూపించిందని తులసి రెడ్డి అన్నారు.
పదవి పిచ్చి లేదంటూనే...
తనకు పదవి పిచ్చి లేదని,సైద్ధాంతిక బలం వుందని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్న తులసీరెడ్డి, పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్య మంత్రి పదవి ఎందుకు? సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు? అని తులసీ రెడ్డి ప్రశ్నించారు. కడప జిల్లాలో కాశినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చడమేనా మీరు వల్లించే సనాతన ధర్మం? అంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీని తానే నిలబెట్టినట్లు పవన్ చెప్పడం విడ్డూరమని, పిఠాపురం సభ మొత్తం ఆత్మ స్తుతి పరనింద గా సాగిందన్నారు. సొంత డబ్బా వాయించుకోవడం తోనే సరిపోయిందని సూపర్ సిక్స్ హామీల ప్రస్తావనే లేదంటూ మండిపడ్డారు