17కు చేరిన అనకాపల్లి సెజ్ మృతుల సంఖ్య

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లో మృతుల సంఖ్య పదిహేడుకు పెరిగింది.

Update: 2024-08-22 02:03 GMT

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లో మృతుల సంఖ్య పదిహేడుకు పెరిగింది. నిన్న మధ్యాహ్నం ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో లో రియాకర్ట్ పేలిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు దాటికి  భారీగా ప్రాణ నష్టం సంభవించింది. అరవై మందికి పైగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లో మంటలు అంటుకోవడంతో కార్మికులు ఫ్యాక్టరీ లో చిక్కుకుపోయారు. పేలుడు ధాటికి కంపెనీ పై కప్పు కూలిపోయిందంటే ఎంతటి ప్రమాదం జరిగిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

మంటలను అదుపు చేయడానికి...
మహిళలు, పురుషులు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. ఇక పై కప్పు కూలడంతో శిధిలాల కింద చిక్కుకుని మృతి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడానికి ఆరు అగ్నిమాపక శకటాలను ఉపయోగించినా అవి అదుపులోకి రాలేదు. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను రక్షించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొందరిని అతి కష్టం మీద కిందకు దించినా అందులో చిక్కుకుపోయి గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా  ఉంది.
షిఫ్ట్‌ మారే సమయంలో...
మధ్యాహ్నం జరగడంతో షిఫ్ట్‌ మారుతుండటంతో రెండు షిఫ్ట్‌ల కార్మికులు ఇందులో ఉన్నారని యాజమాన్యం చెబుతున్నారు. విధులకు హాజరయ్యే సమయంలో ఈ ప్రమాదం జరగడం వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. గాయపడిన కార్మికులను అనకాపల్లి, విశాఖపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడంతో దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కంపెనీలో ఎంత మంది పనిచేస్తున్నారన్నది మాత్రం తెలియరాలేదు.


Tags:    

Similar News