Tirumala : తిరుమలలో భారీగా భక్తులు.. కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు

Update: 2024-10-13 02:44 GMT

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గత తొమ్మిది రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు కావడంతో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాలు నిన్న రాత్రి ధ్వజాఅవరోహణంతో ముగిశాయి. అయితే ఈరోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా ముందుగా బుక్ చేసుకున్న వారితో పాటు దసరా సెలవులు ఇంకా ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సాధారణంగా శని, ఆదివారాల్లో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. అధిక సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాలుకు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోజు కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు అందిస్తున్నారు.

అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి...
తిరుమలలో ఇటీవల కాలంలో రద్దీ లేని రోజు లేదు. ప్రతి రోజూ భక్తులు అధిక సంఖ్యలోనే వస్తున్నారు. ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట బాట గంగమ్మ దేవాలయం వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల వరకూ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,684 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,482 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.72 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News