Rain Alert : పిడుగులు పడే అవకాశం... ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు
రాష్ట్రానికి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది
రాష్ట్రానికి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
రేపటి నుంచి...
ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుండి 55 కి.మీ వేగంతో ఈదురగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 లను ఏర్పాటు చేసింది.
ఈ జాగ్రత్తలు పాటించాలి...
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని, దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థకోరింది. భారీవర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద ఉండకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అప్రమత్తంగా ఉండాల్సిందే...
తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ను హోంమత్రి వంగలపూడి అనిత నిర్వహించారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24x7 అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి కోరారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దక్షిణకోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా ప్రాంతాలలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో గండ్లు పడే కాలువలు, గట్లను గుర్తించి పర్యవేక్షించాలని ఆదేశించింది. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరింది.