Devaragattu : కర్రలు లేచాయి.. తలలు పగిలాయ్
కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో అర్ధరాత్రి బన్నీ ఉత్సవాలు జరిగాయి.
దేవరగట్టు సమరం జరిగింది. కర్రలు పైకి లేచాయి. తలలు పగిలాయి. కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో అర్ధరాత్రి బన్నీ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా దాదాపు డెబ్భయి మందికి గాయాలయ్యాయి. ఏడు గ్రామాల ప్రజలు ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో సమరం చేస్తారు. దసరా రోజున జరిగే ఈ బన్నీ ఉత్సవం కొన్నేళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా గ్రామస్థులు మాత్రం కర్రల సమరం కొనసాగిస్తున్నారు.
ఏడు గ్రామాల ప్రజలు...
ఈ ఏడాది కూడా అదే రీతిలో బన్నీ ఉత్సవాన్ని కొనసాగించారు. తెల్లవారుజాము వరకూ జరిగిన ఈ కార్యక్రమంలో కర్రలతో ఏడు గ్రామాల ప్రజలు తలపడ్డారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోని ప్రజలు కూడా తరలి వచ్చారు. దేవతా మూర్తులను దక్కించుకోవడానికి సుళువాయి. అరిరెరెతండా, అరికెర, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామ ప్రజలు కర్రలతో తలపడతారు. వెంటనే గాయపడిన వారిని స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స నిర్వహించారు. కొందరు తమ గాయాలకు తమంతట తామే పసుపు రాసుకుని వెళ్లిపోవడం అలవాటు.