TDP : ఇద్దరివీ వేర్వేరు ఆలోచనలు.. టీడీపీలో హాట్ టాపిక్

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ , మరొకరు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వేర్వేరు ఆలోచనలు హాట్ టాపికయ్యాయి

Update: 2024-10-13 06:04 GMT

ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే. ఒకరు మంత్రి, మరొకరు మాజీ ఎమ్మెల్యే.. యాక్టింగ్ ఎమ్మెల్యే. అయితేనేం ఇద్దరివీ వేర్వేరు మార్గాలు. ఒకరు కార్యకర్తల కోసం తన సొంత డబ్బులు ఖర్చు చేస్తుండగా, మరొకరు తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం వ్యాపారుల నుంచి కమీషన్ అడుగుతున్నారు. దీంతో ఇది తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఒకరు మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కాగా, మరొకరు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా సాగుతున్నాయి. తమ గెలుపునకు సహకరించిన కార్యకర్తల కోసం ఒకరు, తన ప్రజల కోసం మరొకరు ఇలా నిజంగా చర్యలకు దిగడం విశేషంగానే చెప్పుకోవాలి.

కార్యకర్తలకు అండగా...
గత ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రధాన పార్టీ. ఆ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే కార్యకర్తల సమిష్టి కృషితోనే గెలిచిందని చెప్పాలి. గత ప్రభుత్వానికి భయపడకుండా, ఏమాత్రం దడవకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కార్యకర్తలు నిలిచారు. దీంతో పాటే ప్రజల్లో కూడా గత ప్రభుత్వంలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో వైసీపీ దారుణ ఓటమి పాలయింది. దీంతో టీడీపీ పోటీ చేసిన అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. అలాంటి తెలుగుదేశం పార్టీ నేతల్లో గెలిచిన తర్వాత ఆలోచనల్లో అనేక మార్పులు వచ్చాయి. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు తాము చేయకూడదని నిర్ణయించారు.
నెల్లూరు నియోజకవర్గంలో....
నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ గెలిచారు. అయితే అందుతున్న సమాచారం మేరకు నారాయణ తన అనుచరుల కోసం మద్యం దుకాణాల వేలంలో లైసెన్స్ ఫీజు సొంత డబ్బును ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రెండు కోట్ల రూపాయలతో వంద టెండర్లు వేసినట్లు చెబుతున్నారు. లాటరీ విధానంలో మద్యం షాపులు వస్తే అవి పార్టీ కార్యకర్తలనే తీసుకోవాలని సూచించారంటున్నారు. వంద టెండర్లకు పైగా నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో వేసినట్లు తెలిసింది. అయితే లాటరీలో ఆ దుకాణాలు వస్తే ఆదాయం కార్యకర్తలని పంచుకోవాల్సిందిగా నారాయణ చెప్పడం నిజంగా పార్టీ క్యాడర్ ను ఆదుకోవడమేనని అంటున్నారు. రాష్ట్రంలో మరే నేత, ఎమ్మెల్యే చేయలేని పని ఒక్క నారాయణ మాత్రమే కార్యకర్తల కోసం చేశారంటున్నారు.
తాడిపత్రిలో మాత్రం...
ఇక తాడిపత్రి విషయానికి వస్తే ఇక్కడ నియోజవర్గ అభివృద్ధి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రతిపాదన తెలిపారు. ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇసుక, మద్యం వ్యాపారులతో పాటు ఎవరు వ్యాపారం చేసినా ప్రతి మండలానికి రూపాయికి పదిహేను పైసలు చొప్పున కమీషన్ ఇవ్వాలని ఆయన కోరారు. తాను మరో పదిహేను శాతం సొంత నిధులు జమ చేసి తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నిజానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అయినప్పటికీ ఈయనే అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికే ఆ నిధులు ఖర్చు చేస్తానని పదిహేను శాతం కమీషన్ ఇవ్వక తప్పదని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇద్దరు నేతల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.


Tags:    

Similar News