Liqour New Rates In Andhra Pradesh : లిక్కర్ రేట్లు తగ్గుతున్నాయోచ్... ఇక పెగ్గుమీద పెగ్గు వేసియండి బ్రో
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ బాటిల్స్ ధరలు తగ్గుతున్నాయి. అన్ని రకాల బ్రాండ్లు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ బాటిల్స్ ధరలు తగ్గుతున్నాయి. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అక్టోబరు నెల నుంచి నూతన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మద్యంపై మాట్లాడకుండా లేరు. ఆయన మద్యం ధరలు, నాసిరకం మద్యం పై అంత సీరియస్ గా తీసుకున్నారు.
నాసిరకం మద్యం కారణంగా...
గత ప్రభుత్వం పంపిణీ చేసిన నాసిరకం మద్యం కారణంగా అనేక మంది మరణిస్తున్నారని, ఒంటితో పాటు ఇల్లు కూడా గుల్లవుతుండటంతో ఆయన మద్యం ధరలపై ప్రత్యేక హామీని ఎన్నికల సందర్భంగా ఇచ్చారు. గత ప్రభుత్వం ఒక క్వార్టర్ బాటిల్ రెండు వందల రూపాయలకు విక్రయించడంతో పాటు నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తుండటంతో గంజాయి వాడకం కూడా పెరిగిందని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు జరిపిన అధ్యయనంలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నాణ్యమైన బ్రాండ్లు...
దీంతో వివిధ రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధికారులు అధ్యయనం చేశారు. అక్కడ ధరలతో పాటు నాణ్యమైన బ్రాండ్లను తయారు చేస్తున్న కంపెనీలతో మాట్లాడారు. అన్ని రకాల బ్రాండ్లను ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.అక్టోబరు 4 లేదా 5 తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానుండటంతో ముందుగానే అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు ఇక ఏపీలో దర్శనమివ్వనున్నాయి. తక్కువ ధరకు మద్యాన్ని అందించాలని, క్వార్టర్ బాటిల్ వంద రూపాయలు అందుబాటులో తెచ్చేలా కూటమి ప్రభుత్వం దాదాపుగా డిసైడ్ అయింది. దీంతో ఏపీలో మద్యం ధరలు దిగి రావడమే కాకుండా, నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.