ట్యాపింగ్ అంతా ట్రాష్ : పేర్ని నాని
సానుభూతి కోసమే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు
ఎంతమంది ఫోన్లు వింటూ కూర్చుంటారని, ఇదేనా ప్రభుత్వం పని అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కోటంరెడ్డి వ్యవహారంపై ఆయన స్పందించారు. జగన్ తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సానుభూతి కోసమే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాప్ చేస్తేనే నిజంగా పార్టీ నుంచి వెళ్లిపోతారా? అసలు సిసలైన వైసీపీ నేత అయితే చంద్రబాబుతో మాట్లాడుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. కోటంరెడ్డి ఆడియో సోషల్ మీడియాలో సర్క్కులేట్ అయితే ఇంటలిజెన్స్ చీఫ్ అదేదో చూసుకోవాలని పంపించి ఉంటారని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. బలహీన నాయకత్వాన్ని నమ్ముకుని కోటంరెడ్డి వెళుతున్నారన్నారు.
మంత్రి పదవి అలాగే ఇస్తారు...
ఆరు సార్లు గెలిచిన వారికి కూడా మంత్రి పదవులు రాలేదని, సామాజిక వర్గం కోణంలో మంత్రి పదవులు కేటాయింపులు జరుగుతాయని తెలిపారు. అవసరం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారన్నారు. నిజింగా పార్టీ పట్ల భక్తి ఉంటే వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ జరిగినా వెళ్లరని నాని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచైనా ఏ పార్టీ నుంచైనా పోటీ చేయవచ్చని పేర్ని నాని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ ఉత్త ట్రాష్ అని కొట్టిపారేశారు. జగన్ పార్టీ పెట్టకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు అయి ఉండే వారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకున్నా ఇబ్బందేమీ ఉండదన్నారు.