మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని, లేనిపక్షంలో పనులను..
అమరావతి/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానులు సెగలు కక్కుతున్నాడు. ఫలితంగా విపరీతమైన ఉక్కపోత, నీరసం వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కూడా ఉండటంతో.. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో వాతావరణశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని, లేనిపక్షంలో పనులను వాయిదా వేసుకుని ఇంటిపట్టునే ఉండటం మంచిదని అధికారులు సూచించారు. అలాగే పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. ఎండలు తీవ్రతరమవుతోన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యానాం ప్రాంతంలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న తిరుపతిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. విజయవాడలో ఉష్ణోగ్రత 44.8 డిగ్రీలను తాకింది. గుంటూరులో 44.2, కర్నూలు, నందికొట్కూరు లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు వెంటతీసుకుని వెళ్లాలని వాతావరణశాఖ సూచించింది.
తెలంగాణ విషయానికొస్తే.. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. అలాగే ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో నిన్న గరిష్టంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. నిజామాబాద్ లో 45, జగిత్యాలలో 44.9, నిర్మల్ లో 44.8, మంచిర్యాలలో 44.4, హైదరాబాద్ లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.