ఏనుగుల బీభత్సం.. పంటపొలాలు ధ్వంసం
విజయనగరం జిల్లాలో ఏనుగులు సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఏనుగులు సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలోని వంగర మండలంలోని జీకే, గుమడ గ్రామాల మధ్య పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. మొక్కజొన్న, చెరుకు, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తుండటంతో రైతులు అటవీ శాఖ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. తమ గ్రామానికి ప్రతి సారీ ఏనుగుల బెడదతో పంట చేతికి రాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ఏనుగుకు ఆడ ఏనుగు జన్మనిచ్చింది. ఆ గున్న ఏనుగుకు కాపలాగా ఏనుగుల గుంపు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రాత్రి వేళ విద్యుత్తును ఆపేసి...
అయితే రాత్రి వేళ ఊళ్ల మీదకు రాకుండా తమ గ్రామాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారని, ఏనుగులను మాత్రం రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద నివారణకు కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి, మంత్రులను కలసి కోరిన సంగతి తెలిసిందే. అవి వస్తే తప్ప ఈ బెడద తమకు తప్పేటట్లు లేదని రైతులు చెబుతున్నారు.