Cold Winds : చలిని ఎంజాయ్ చేస్తున్నారట.. మరికొద్ది రోజులు ఇలాగేనట
చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలలో చలిగాలులు ఎక్కువగానే ఉన్నాయి
cold winds:చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలలో చలిగాలులు ఎక్కువగానే ఉన్నాయి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు రెండు రోజులు మూడు రోజుల పాటు చలిగాలులు ఉంటాయని చెబుతున్నా అవి మాత్రం ఎన్ని రోజులైనా తగ్గడం లేదు. హైదరాబాద్ నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటలు దాటిన తర్వాతనే సూర్యుడు కనిపిస్తున్నాడు. చలికి జనం గజ గజ వణికిపోతున్నారు. బయటకు రావడానికే భయపడిపోతున్నారు.
ప్రమాదాలు ఎక్కువగా...
ప్రధానంగా రహదారులపై ప్రమాదాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. మంచు కురుస్తుండటం ముందు వెళుతున్న వాహనం కనిపించకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడా జాతీయ రహదారులపై వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుంది. అయినా ప్రమాదాలు మాత్రం ఎక్కువగానే జరుగుతున్నాయి. ఉదయం వేళల్లో ప్రయాణించకపోవడమే మంచిదని పోలీసులు సయితం సూచిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో...
మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సోనాలలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే అల్లూరి సీతారామ జిల్లాలోని అరకు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పదిలోపే నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పొగమంచులో పర్యాటక కేంద్రాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. చలిని ఎంజాయ్ చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుండటంతో అరకులో కాటేజీలు కూడా దొరకడం లేదు. దీంతో తమ వాహనాల్లోనే కొందరు సందర్శకులు తలదాచుకుంటున్నారు.