Tirumala : తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల సంఖ్య.. రీజన్ ఇదే

తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. సోమవారం కావడంతో రద్దీ తక్కువగా ఉంది

Update: 2024-12-30 02:32 GMT

తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. సోమవారం కావడంతో రద్దీ తక్కువగా ఉంది. వరస సెలవులు ముగియడంతో నేడు తిరుమలలోని వీధులన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కంపార్ట్ మెంట్లలో కూడా భక్తులు లేకపోవడంతో సులువుగానే దర్శనం చేసుకుంటున్నారు. మాడ వీధులతో పాటు అన్ని ప్రాంతాలు తిరుమలలో ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. నేడు సోమావతి అమావాస్య కావడంతో భక్తులు ఎవరూ తిరుమలకు రాకుండా నేడు శైవ క్షేత్రాలను ఎక్కువగా దర్శిస్తారని అధికారులు చెబుతున్నారు. నిన్నటి వరకూ తిరుమల కిటకిట లాడింది. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. దర్శనానికిఇరవై గంటలకు పైగానే సమయం పట్టింది. అయితే సులువుగా దర్శనం అవుతుండటంతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు వచ్చిన భక్తులు ఆనందంతో గోవింద నామస్మరణలతో ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు.ఎక్కడా పెద్దగా తోపులాట, కిక్కిరిసిపోకుండా లైన్లు మామూలుగా సాగిపోతుండటంతో భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఏపీ, తెలంగాణ నుంచి కూడా నేడు భక్తులు కొంత రావడంతో పాటు అయ్యప్పస్వాములు కూడా రావడం కొంత మేర కంపార్ట్ మెంట్ లు నిండాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.



ఒక కంపార్ట్ మెంట్ లోనే...

తిరుమలలో సహజంగా సోమవారం రద్దీ తక్కువగానే ఉంటుంది. ఆదివారం వరకూ కొనసాగిన రద్దీ ఒక్కసారిగా రద్దీ తగ్గడంతో లడ్డూ విక్రయాలు కూడా నేడు తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం మాత్రం తగ్గదన్న భావనలో అధికారులున్నారు. ఈరోజు తిరుమలలోని ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతుందని, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండుగంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,950 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,950 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News