Chandrababu : అబ్బే ఇది వర్క్ అవుట్ అవ్వదు సామీ.. విఫల ప్రయోగమే?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది ఫీడ్ బ్యాక్ ను తెప్పించుకోవడం తొలి నుంచి అలవాటు.

Update: 2024-12-30 05:59 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది ఫీడ్ బ్యాక్ ను తెప్పించుకోవడం తొలి నుంచి అలవాటు. 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈ ఫీడ్ బ్యాక్ ను పార్టీ కార్యకర్తల నుంచి కాకుండా ఐఏఎస్ అధికారుల నుంచి తెప్పించుకునేవారు. దీంతో పాటు ఇంటలిజెన్స్ నివేదికలు ఎలాగూ వచ్చేవి. తన గురించి,తన ప్రభుత్వ పాలన గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నమిది. ఒరకంగా ఇలా తెలుసుకోవాలనుకోవడం మంచిదే. ఎందుకంటే జనాభిప్రాయాన్ని బట్టి ఏ రాజకీయ పార్టీ మనుగడ అయినా కొనసాగుతంది. అందుకే ఫీడ్ బ్యాక్ అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఒకరకంగా ఫీడ్ బ్యాక్ తీసుకోవడమనేది చంద్రబాబు నుంచే మొదలు అనుకోవాలి.

జనం వాయిస్ ను...
అయితే ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో జనం మనసులో ఉన్న మాటలను సరిగా చంద్రబాబుకు చేరవేసేవారు కారు. దీంతో వచ్చే ఫీడ్ బ్యాక్ లో నిజాలు కేవలం ముప్ఫయి శాతం మాత్రమే ఉండేవన్నది కాదనలేని వాస్తవం. ఎందుకంటే తమ లోపాలు బయటపడతాయని జనం వాయిస్ ను చంద్రబాబుకు ఐఏఎస్ లు చేర్చరు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇటు ఐఏఎస్ లను, ఐపీఎస్ లను ఏ నేతా నమ్ముకోవడం లేదు. అందులో చంద్రబాబు కూడా ఒకరు. అలాగే పార్టీ కార్యకర్తలను కూడా విశ్వసించడం లేదు. కానీ అందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిధులు గుమ్మరించి మరీ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై జనం నాడిని తెలుసుకుంటారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐ ప్యాక్ టీంతో నివేదికలు తెప్పించుకునే వారు. కానీ మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓటమిపాలయ్యారు.
ఫీడ్ బ్యాక్ కోసం...
ఇప్పడు చంద్రబాబు కూడా రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక బృందానికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. పాలనలో సమస్యలు, పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో నేరుగా ముఖ్యమంత్రికి నివేదించడం ఈ బృందం చేసే ముఖ్యమైన పని. ఈ బృందానికి 'చీఫ్‌ మినిస్టర్‌ ఫెలోస్‌' అని పేరు పెట్టారని తెలిసింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ఈ టీం కోసం ఎంపిక చేయనున్నారు. వీరికి ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు కేటాయించనున్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి వీరంతా జిల్లాలకు వెళ్లి జనం నాడిని తెలుసుకోనున్నారు. నేరుగా సీఎం కార్యాలయానికి నివేదికల రూపంలో అందచేయనున్నారని చెబుతున్నారు.
రాబిన్ శర్మ నేతృత్వంలో...
రాబిన్ శర్మ మొన్నటి ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్తగా టీడీపీకి పనిచేశారు. ఆ టీం సేవలనే చీఫ్ మినిస్టర్ ఫెలోస్ లో ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఖచ్చితమైన సమాచారాన్నినిర్మొహమాటంగా అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఉచితఇసుక, మద్యం పాలసీ, సూపర్ సిక్స్ హామీలు, ఉచిత గ్యాస్ వంటి పథకాలతో పాటు కూటమి పార్టీల కలయికపై కూడా జనం అభిప్రాయాలను ఎప్పటికప్పడు ఈ టీం సేకరించి సీఎంవోకు అందచేయనుంది. అందులో ఏమైనా లోటు పాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోవడానికి వీలవుతుందని చంద్రబాబు కొంత ఆర్థికభారమైనా మరోసారి గెలుపుకోసం ఈ టీంను ఏర్పాటు చేసుకన్నారని చెబుతున్నారు. చూద్దాం.. మరి రాబిన్ శర్మ ఈసారి ఎలాంటి ఫలితాలను చంద్రబాబుకు చెంతకు చేరవేస్తారనేది? అయితే చంద్రబాబుకు ఖచ్చితమైన సమాచారం వస్తుందా? రాదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా, ఉన్నత విద్యచదువుకున్న వారికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు సరైన ఫీడ్ బ్యాక్ ఇస్తారా? అన్నది కూడా అనుమానమే.


Tags:    

Similar News