Pawan Kalyan : ప్రశ్నలేవి సామీ.. అంతా పొగడ్తలేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మారారు. వైసీపీని అధికారం నుంచి దించి కూటమి ప్రభుత్వాన్ని ఏపీలో తేవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మారారు. వైసీపీని అధికారం నుంచి దించి కూటమి ప్రభుత్వాన్ని ఏపీలో తేవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అయితే పదేళ్ల నుంచి ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ కల్యాణ్ కేవలం జగన్ ను మాత్రమే ప్రశ్నిస్తూ పాలనలో లోపం జరిగినా, ప్రభుత్వ వైఫల్యం జరిగినా ఆయన పట్టించుకోవడం లేదు. ప్రశ్నించడం పూర్తిగా మానేసినట్లుందని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పవన్ కల్యాణ్ పొగడ్తలకే పరిమితమయ్యారంటున్నారు. ఏడు నెలల కాలంలో కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదన్న విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ అంటే సినీ హీరో గా అందరికీ అభిమానం ఉంటుంది.
పెదవి విప్పక పోవడంపై...
ఆయన రాజకీయ రంగంలోనూ అలాగే వెలుగొందుతారని అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. అలాగే సొంత సామాజికవర్గమైన కాపులు కూడా ఎన్నికలకు ముందు పవన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాయిస్ మాత్రం పూర్తిగా మ్యూట్ అయిపోయింది. ఏ ఘటన జరిగినా కనీసం ముందుగా స్పందించే పవన్ తన ప్రభుత్వంలో జరిగిన ఘటనలపై మాత్రం పెదవి విప్పకపోవడాన్ని విపక్షాలు సయితం ప్రశ్నిస్తున్నాయి. పార్టీ పదవుల విషయం సంగతి పూర్తిగా పక్కన పెట్టేశారని జనసేన నేతలే అంటున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమకు అన్యాయం జరిగిందని నేతలు భావిస్తున్నారు.
తిరుపతి తొక్కిసలాటలో...
ఇదే సమయంలో తిరుపతి తొక్కిసలాట జరిగి గంటలు గడుస్తున్నా పవన్ కల్యాణ్ స్పందించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నీ ప్రశ్నలేమయ్యాయ్యా? అంటూ నిలదీస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వచ్చి రోడ్డు ప్రమాదంలో అభిమానులు చనిపోతే గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయకపోవడమే కారణమని, అందుకే ప్రమాదం జరిగిందని అన్న పవన్ కల్యాణ్ తిరుపతి ఘటనపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలకు జనసేనాని వద్ద సమాధానం లేదు. ఆయన మౌనంగా ఉండటానికి కారణాలేంటని కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అందరినీ తప్పుపట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడరని అడుగుతున్నారు.
విశాఖ సభలోనూ...
ఇక నిన్న విశాఖలో జరిగిన బహిరంగ సభలోనూ ప్రధాని మోదీని, ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికే పవన్ కల్యాణ్ ఎక్కువ సమయం గడిపారని, అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఊసు కూడా ఎత్తలేదంటూ కార్మిక సంఘాలు అంటున్నాయి. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వమే ప్రయివేటీకరణకు కారణమని పదే పదే విమర్శలు చేయడమే కాకుండా విశాఖకు వెళ్లి కార్మికుల ఆందోళనకు మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ కు ప్రధానిని సభలో ఆ విషయం అడగకుండా ఎందుకు ఉన్నారని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి. అందుకే అధికారం అనేది ఎవరి చేతుల్లో ఉన్నా చేతులు, నోళ్లు మూతబడిపోతాయని అనుకోవడానికి పవన్ కల్యాణ్ ఉదాహరణ అని కామెంట్స్ వినపడుతున్నాయి.