Amaravathi Real Estate : నిన్నటి వరకూ కొనేవారు లేరు.. నేడు అడుగుతున్నారట.. అమరావతిలో భూములకు మళ్లీ రెక్కలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత ఐదేళ్ల నుంచి భూముల ధరలు నేల చూపులు చూస్తున్నాయి. నేడు కొంత ధరలు పెరిగాయంటున్నారు
Amaravathi Real Estate :ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత ఐదేళ్ల నుంచి భూముల ధరలు నేల చూపులు చూస్తున్నాయి. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తేవడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు ధరలు దారుణంగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే స్థితికి చేరుకున్నాయి. కేవలం భూములే కాదు.. అపార్ట్‌మెంట్ల కొనుగోలు కూడా గత నాలుగేళ్లలో తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. క్రమంగా ధరలు పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన మరుసటి రోజు నుంచే ధరల పెరుగుదల కనిపించిందని అంటున్నారు.
ధరలు తగ్గడంతో...
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. రైతుల నుంచి ముప్ఫయివేల ఎకరాలకు పైగానే సేకరించింది. అక్కడ తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం కావడంతో పాటు హైకోర్టు నిర్మాణం కూడా జరగడంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ భూముల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఒకవైపు వినిపించినా, మరొక వైపు మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ధరలు మాత్రం బాగా పెరిగాయి. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో ఇక్కడ భూములను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు.
కొనుగోలు చేయడానికే...
నిన్న మొన్నటి వరకూ అసలు భూములను కొనుగోలు చేయడానికి కనీసం ఆరా తీసే వారే కరువయ్యారని, కానీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తర్వాత కొంత భూముల ధరలపై ఆరా తీసే వారి సంఖ్య కనపడుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడం ఒకవైపు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటు కావడంతో మూడు పార్టీలూ ఇక్కడే రాజధాని ఉంటుందని ప్రకటించడం కూడా రియల్ బూమ్ రావడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేట వద్ద సభలో పాల్గొన్న తర్వాత రోజు నుంచి ధరల గురించి అడిగే వారి సంఖ్య మరింత ఎక్కువయిందని అంటున్నారు. మరి రియల్ బూమ్ వచ్చినట్లే అనుకోవాలా? లేక ఇది రియల్ ఎస్టేట్ సంస్థలు ఆడుతున్న మరో డ్రామా అని భావించాలా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాతనే అసలు ధరలు పెరిగాయా? తగ్గాయా? అన్నది తెలుస్తుంది.