జేపీకి, వైసీపీకి లింకేంటి.?

ఎన్నిక‌ల వేళ‌ ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.

Update: 2023-08-08 08:13 GMT

ఎన్నిక‌ల వేళ‌ ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తులు, నేత‌ల పార్టీల మార్పు వంటి విష‌యాల‌పై ఊహాగానాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ ఆస‌క్తిక‌ర వార్త మీడియా స‌ర్కిల్స్‌లో గ‌ట్టిగా విన‌బ‌డుతోంది. లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయణ వైసీపీలో చేర‌నున్నార‌నే ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రుగుతుంది. అస‌లేం జ‌రిగిందో తెలుసుకుందాం.

విజయవాడలో ఇటీవ‌ల‌ జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు లోక్ సత్తా అధ్య‌క్షుడు జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు. వేదిక మీదకు జయప్రకాశ్ నారాయణ వస్తున్న సమయంలో సీఎం జగన్ లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. తన పక్క సీట్‌లో కూర్చోబెట్టుకుని.. ఆయ‌న‌తో ముచ్చటించ‌డం జ‌రిగింది. అలాగే ఓ ఇంట‌ర్వ్యూలో జేపీ మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థను ప్రశంసించారు. ఈ రెండు సంద‌ర్భాల‌ను బేస్ చేసుకుని ర‌క‌ర‌కాలుగా క‌థ‌నాలు పుట్టుకొస్తున్నాయి. వైసీపీ నుంచి జేపీ ఎంపీగా పోటీ చేయ‌నున్నార‌ని.. లోక్ సత్తాను వైసీపీలో విలీనం చేస్తార‌ని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై లోక్ సత్తా ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి స్పందించారు. జేపీ వైసీపీలో చేరుతార‌న్న‌ ప్రచారంలో నిజం లేదని చెప్పారు. జయప్రకాశ్ నారాయణ గతంలో ఆప్కాబ్ ఛైర్మన్ గా పని చేశారని.. ఆ హోదాలోనే ఆయన వజ్రోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు.




Tags:    

Similar News