బాబును కట్టడిచేయడానికి…
చంద్రబాబు నిజానికి మోదీ కంటే సీనియర్ నేత. రాజకీయాల్లో మోదీతో పాాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అనేకసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెగదెంపులు చేసుకోవడం ఆయనకు అలవాటు. నితీష్ కుమార్ కూడా అంతే. అందుకే ఇద్దరు సీనియర్ నేతలను మోదీ నమ్మే అవకాశమే లేదు. అందుకే జమిలి ఎన్నికలకు వెళ్లినా వీరిద్దరి విషయంలో ఒకింత జాగ్రత్త పడతారంటున్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లలో ఒకింత ఇద్దరు నేతల గ్రిప్ ను తగ్గించేందుకు మోదీ ప్రయత్నిస్తారన్నది తెలుగుదేశం పార్టీ నేతలు సయితం అనుమానిస్తున్నారు. తనను శాసించే పరిస్థితిని మోదీ తెచ్చుకోరు. తన చేయి పైన ఉండాలని, తనను ఒకరు యాచించాలి తప్ప డిమాండ్ చేయడం మాత్రం ఆయన సహించలేరన్నది మోదీ నైజం తెలిసిన వారు ఎవరైనా ఒప్పుకునే విషయం. అందుకే ఈ ఇద్దరు సీనియర్ నేతలైన నితీష్ కుమార్, చంద్రబాబుల విషయంలో మోదీ ఇప్పటికే స్కెచ్ వేసి ఉంటారన్నది భావిస్తున్నారు. వారిని రాజకీయంగా కొంత బలహీనం చేయగలిగితేనే పది కాలాల పాటు పాలన సాగించవచ్చన్న ఆలోచన సహజంగానే మోదీలో ఉంటుందని చెబుతున్నారు.
పవన్ ను అడ్డంపెట్టి…
అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ లో హైలెట్ చేయాలని మోదీ భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ కొంతకాలం ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే కాకినాడ పోర్టు పైన పడటం కూడా ఒకింత ఢిల్లీ వ్యూహమేనన్న వారు కూడా లేకపోలేదు. అయితే అందులో నిజమెంత? అన్నది పక్కన పెడితే.. చంద్రబాబు గతంలో మాదిరిగా మోదీని డిమాండ్ చేయలేరు. ఎందుకంటే ఏపీలో పవన్ అవసరం చంద్రబాబుకు ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరోసారి పవన్ తో కలసి ప్రయాణం చేస్తేనే అధికారం దక్కుతుంది. ఆ వీక్ నెస్ తోనే పవన్ ను మోదీ మంచి చేసుకుంటున్నారు. వీలయినప్పుడల్లా పవన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పవన్ కల్యాణ్ కు ఢిల్లీ స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ ను కూడా రూపొందించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ అత్యధిక స్థానాలను కోరే ఛాన్స్ తో పాటు సీఎం సీటు షేరింగ్ విషయంపై కూడా ఒప్పందం చేసుకోవాలన్న ప్రతిపాదన తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదన్నది రాజకీయవర్గాల అంచనాగా వినిపిస్తుంది. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అయితే.. మోదీ అంతకు మించి. చంద్రబాబు భయం కూడా అదే. మోదీని వదిలి పవన్ బయటకు రారు. అలా ఫిక్స్ చేయడంలో నరేంద్ర మోదీ ఇప్పటికే సక్సెస్ అయినట్లు ఏపీ రాజకీయాలు పరిశీలించిన వారికి ఎవరికైనా అర్ధమవుతుంది. మొత్తం మీద దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలంటే ఏపీలో గ్రిప్ సంపాదించాలన్న మోదీ ఆలోచనతో పవన్ కు రానున్న కాలంలో మరింత ప్రయారిటీ ఇస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి. రేపు ఎనిమిదోతేదీన విశాఖ పర్యటనలో కూడా మోదీ పవన్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి.
జగన్ విషయంలోనూ…
అందుకేచంద్రబాబు నాయుడు పెద్దగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో డిమాండ్ చేయలేని పరిస్థితి ఉంది. కూటమితోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఈసారి మాత్రం పవన్, మోదీలను దూరం చేసుకునే ఆలోచన చేయరు. రాజధాని అమరావతి నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేదు. కేవలం ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు మాత్రమే సహకారం అందించింది. అదే సమయంలో జగన్ విషయంలోనూ ఒకింత మోదీ సాప్ట్ కార్నర్ లో ఉన్నారని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును కొంత కట్టడి చేయాలంటే జగన్ ను ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అదే జగన్ ధైర్యం అని కూడా అంటున్నారు. ఇటీవల అమిత్ షాతో విజయసాయిరెడ్డి సమావేశం కూడా అందులో భాగమేనంటున్నారు. అలాగే జగన్ కేసుల విషయంలో కూడా ఎటూ తేల్చుకుండా చూసి చంద్రబాబుకు చెక్ పెట్టడమే కమలం పెద్దల ఆలోచనగా ఉందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. మొత్తం మీద కూటమి కలిసి ఉన్నప్పటికీ బలమైన నేతలను బలహీన పర్చే యత్నాలు మాత్రం ప్రారంభమయ్యాయనే అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.