మంత్రి బొత్స కీలక కామెంట్స్
ఎవరో భూ ఆక్రమణలు చేశారని రాజధానిని ఎలా వద్దనుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఎవరో భూ ఆక్రమణలు చేశారని రాజధానిని ఎలా వద్దనుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అనకాపల్లి లో జరిగిన వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖకు పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కూడా మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో వెనకబడిన ఉత్తరాంధ్రకు వచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ ను ఈసారి మిస్ చేసుకోకూడదని పిలుపునిచ్చారు.
పనిగట్టుకుని దుష్ప్రచారం...
కొందరు పనిగట్టుకుని విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విశాఖలో భూ ఆక్రమణలకు గురైతే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భూ ఆక్రమణలు పేరు చెప్పి రాజధానిని అడ్డుకునే ప్రయత్నం కొందరు చేస్తున్నారన్నారు. పరిపాలన రాజధాని ఇక్కడకు రావాల్సిందేనన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.