పోలవరం పై నిమ్మల తాజాగా ఏం చెప్పారంటే?

పోలవరం ప్రాజెక్టు పనులను తమ హాయంలో 72 శాతం పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు

Update: 2024-11-22 07:31 GMT

పోలవరం ప్రాజెక్టు పనులను తమ హాయంలో 72 శాతం పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి,ఎత్తు తగింపు పై శాసన మండలి లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 2014-19 గత టీడీపీ పాలనలో 11,762 కోట్టు ఖ‌ర్చుపెట్టి, 72 శాతంకు పైగా పనులు పూర్తి చేశామన్న నిమ్మల 2019-24 వైసీపీ పాలనలో కేవ‌లం 4వేల కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టి, 3 శాతం పనులు జరిగినట్లు రికార్డుల్లో చూపించారని తెలిపారు. గత టీడీపీ పాలనలో పోలవరం ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణాలకు రూ.4144 కోట్లు ఖర్చు చేస్తే , వైసీపీ పాలనలో ఒక్క అర్ అండ్ ఆర్ కాలనీ పూర్తి చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల వరకు ఏ ప‌నులూ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ డయాఫ్రమ్ వాల్ ను పట్టించుకోకుండా విధ్వంసం చేశారని నిమ్మల ఆరోపించారు. 2020 లో వచ్చిన వరదలతో డివాల్ దెబ్బతిన్నదని ఐఐటీ హైదరాబాద్ నిపుణులే చెప్పారన్న నిమ్మల రామానాయుడు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం తో ,ప్రాజెక్ట్ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళ‌డం తోపాటు, కొత్త‌గా డ‌యా ఫ్రం వాల్ నిర్మాణానికి మరో 1000 కోట్ల ఖర్చవుతోందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో...
గత ప్రభుత్వమే స్టేజి -1,స్టేజి -2 అంటూ ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీట‌ర్ల‌కు ఒప్పుకుంటూ, కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపిందని, 2023 మార్చిలో వైసీపీ ప్రభుత్వం 41.15 మీటర్ల ఎత్తుకు లోబడి రూ.36,449 కోట్ల రివైజ్ కాస్ట్ కమిటీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందని నిమ్మల రామానాయుడు సభకు వివరించారు. ఎన్డిఏ ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి స్దాయిలో 45.72 మీట‌ర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు క‌ట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి రాగానే అయిదురోజుల‌కే ముఖ్యమంత్రి చంద్రబాబు పోల‌వ‌రం సంద‌ర్శించారంటే ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్య‌త ఇస్తున్నారో గ‌మ‌నించాలని నిమ్మల అన్నారు. గ‌త అయిదేళ్ళ పాల‌న‌లో కేంద్రం రూ. 8,382 కోట్లు రీయంబ‌ర్స్ చేస్తే,3,385 కోట్లు ప్రాజెక్టుకు ఖ‌ర్చుపెట్ట‌కుండా దారి మ‌ళ్ళించిన దుర్మార్గ ప్ర‌భుత్వం వైసిపిది అంటూ నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్రంతో సంప్రదింపులు చేసి 12,250 కోట్లు నిధులు తీసుకువచ్చారన్న రామానాయుడు వ‌చ్చే జ‌న‌వ‌రి నుండి డయాఫ్రమ్ వాల్ పనులు మొదలు పెట్టి,సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టి ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News