Chandrababu : నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు.. ఎప్పుడూ లేనంత ఆందోళన ఉందా?
నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు ఈసారి పరిపాలన అంత సులువుగా సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు
నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు ఈసారి పరిపాలన అంత సులువుగా సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. విభజన ఆంధ్రప్రదేశ్ ను ఈ దఫా గట్టును పడేయటం చంద్రబాబుకు కత్తిమీద సామే అవతున్నట్లు కనపడుతుంది. ఆయన నోటి నుంచి వెలువడే మాటలను బట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం అంత సులువైన పని కాదు. సూపర్ సిక్స్ ను అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆయన ఏపీ అప్పుల చరిత్రను చూసిన తర్వాత నిజం తెలిసి ఉండవచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన తన అనుభవాన్నంతా ఉపయోగించి దీని నుంచి బయట పడేస్తారని సహచర మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు.
సూపర్ సిక్స్ తో పాటు...
సూపర్ సిక్స్ తో పాటు ఎన్నికల్లో వివిధ రకాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటికిప్పుడు ఆదాయం రూపంలో వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ ఉన్నది మోదీ. అంత తేలిగ్గా మింగుడు పడడు. అర్థం కాడు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అలాగని కేంద్రంతో కయ్యానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికి గెలిచిన 1999, 2014, 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే గెలుపు సాధ్యమయిందని ఆయన మరవరు. మరవకపోవచ్చు. ఇప్పటికిప్పుడు బీజేపీపై కాలు దువ్వి సాధించిందేమీ లేదన్నది కూడా ఆయనకు తెలియంది కాదు. అందుకే ఆచి తూచి అడుగులు వేయడమే మంచిదన్న భావనలో ఉన్నారు.
కేంద్రాన్ని నొప్పించకుండా....
కేంద్రాన్ని నొప్పించకుండా ఒప్పించడమే చంద్రబాబు ముందున్న లక్ష్యం. చంద్రబాబుకు ప్రధానంగా ఈసారి రాజధాని అమారావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రధమ కర్తవ్యం. ఆ రెండు పూర్తయితే చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిలో మిగిలిపోతుంది. అందుకే ఆయన ఫోకస్ అంతా ఆ రెండింటిపైనా ఉంటుంది. అందులో ఎవరూ తప్పుపట్టడానికి కూడా లేదు. ఎందుకంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన ఆయన మదిలో కీర్తి కాంక్ష కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికీ సైబరాబాద్ నిర్మాణం గురించి తాను చెప్పుకోగలుగుతున్నారంటే అది నాటి తన ముందు చూపు అని జనం కూడా గుర్తించగలుతున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అవసరమవతాయి. దానికి సంబంధించి ఆయన ఆందోళనలో అర్థముంది.
క్యాడర్ కోరికలు...
సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఐదేళ్లు పార్టీ క్యాడర్ పడిన ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో తెగించి పోరాడిన కార్యకర్తలను ఈసారి పక్కన పెట్టకూడదన్నది ఆయన నిర్ణయం. అందుకే కార్యకర్తలు, నేతల అవసరాల కోసం ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇక నియోజకవర్గాల్లో గత ఐదేళ్లుగా అభివృద్ధి లేక సమస్యలు తిష్టవేశాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. అందులోనూ ఈసారి కూటమి తరుపు 164 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించి వచ్చారు. వీరిందరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యల్లో కొన్నింటినైనా పరిష్కరించగలిగితేనే గత పాలనకు, తన పాలనకు మధ్య తేడా చూపించగలుగుతారు. కానీ ఇప్పుడున్న ఏపీ ఆర్ధిక పరిస్థితిని చూసిన వారికి ఎవరికైనా ఇది సాధ్యమేనా? అన్న అనుమానం సహజంగా కలుగుతుంది. అందుకే చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి ఏపీని ఎలా అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తారన్నది మాత్రం చూడాల్సిందే?