Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. దర్శనం కష్టమేనా?

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది. శనివారం కావడంతో అధిక మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు వచ్చారు.

Update: 2024-11-30 03:12 GMT

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది. శనివారం కావడంతో అధిక మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు వచ్చారు. తిరుమల భక్తులతో కిటికటలాడిపోతుంది. ఎక్కడ చూసినా భక్త జనమే. తిరుమల గోవింద నామ స్మరణతో మారుమోగిపోతుంది. తిరుమల తిరుపతి వెంకటేశా అంటూ ఆపదమొక్కుల వాడికి మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. చిత్తూరు జిల్లాలోభారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ చేసింది. అయినా సరే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తిరుపతి, తిరుమలలో కూడా వర్షం పడుతున్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వర్షాన్ని, తుపాను సయితం లెక్క చేయకుండా భక్తులు తరలి రావడంతో అన్నప్రసాదం క్యాంటిన్ వద్ద కూడా రద్దీ పెరిగింది. దీంతోపాటు లడ్డూ తయారీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిన్నటి నుంచి పెంచారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదాలను తయారు చేస్తున్నారు. ఇదే సమయంలో వీలయినంత వరకూ సామాన్యభక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శనివారం రద్దీ...
తిరుమల ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అందులో శని, ఆదివారాలు ఇంకా రద్దీగా ఉంటుంది. సెలవులతో పాటు శ్రీనివాసుడికి ఇష్టమైన శనివారం వడ్డీకాసుల వాడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని అందరూ విశ్వసిస్తారు. అందుకే ఈ రెండు రోజుల పాటు తిరుమలలో సీజన్ తో నిమిత్తం లేకుండా భక్తుల రద్దీ ఉంటుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయంఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,147 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,096 మంది భక్తులు తమ తలనీలలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News