చంద్రబాబు పంచాయతీకి జేసీ డుమ్మా.. అసలు కారణమిదేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవమని చెప్పినా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాలేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవమని చెప్పినా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాలేదు. ఆయన గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి కేవలం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాకాలో ఆల్ట్రాటెక్ పరిశ్రమ ఉంది. ధర్మల్ విద్యుత్తు కేంద్రం మాత్రం జమ్మలమడుగు పరిధిలో ఉంది. అక్కడి నుంచి ఫ్లైయాష్ ను తాడిపత్రికి సమీపంలో ఉన్న సిమెంట్ పరిశ్రమకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అంటే ఇది రెండు నియోజకవర్గాలకు చెందిన సమస్య. ఒక నియోజకవర్గంలో బూడిద దొరుకుతుంది. మరొక నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమకు అది ఉపయోగపడుతుంది.
వైసీపీ హయాంలో...
గత వైసీపీ హయాంలో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు పరస్పర అవగాహనతో ఈ కాంట్రాక్టును పంచుకున్నారు. కానీ మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం తన నియోజకవర్గం నుంచి ఫ్లైయాష్ ను ఎగుమతి చేస్తున్నారు కాబట్టి ఆ కాంట్రాక్టు తమ వారికే దక్కాలని పట్టుబట్టారు. మరోవైపు తన కొడుకు అస్మిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ ఉంది కాబట్టి తన వారికే ఈ కాంట్రాక్టు దక్కాలని భీష్మించుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య గత కొద్దిరోజులుగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
నేరుగా చంద్రబాబు రంగంలోకి...
అయితే దీనిపై పరిష్కారం వెదికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డిలను రావాలంటూ కబురు పంపారు. అయితే భూపేష్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి చంద్రబాబుతో సమావేశానికి వచ్చారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. తన ఆరోగ్యం సరిగా లేదని, అందువల్లనే తాను హాజరు కావడం లేదని, అయితే దీనికి సంబంధించిన లేఖను మాత్రం రాసి వివాదాన్ని లైవ్ లో నే ఉంచేలా చేశారు. అయితే చంద్రబాబు ఈ వివాదాన్ని తాను పరిష్కరిస్తానని ఆదినారాయణరెడ్డికి చెప్పారు. తాను అక్కడి అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిపారని ఆదినారాయణరెడ్డి మీడియాకు తెలిపారు.